Monday, November 14, 2016

Happy Children's Day Telugu Quotes ........My Slideshow

Happy Children's Day Telugu Quotes ........My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

పిల్లలని ఎలా మలిస్తే అలా తయారవుతారు

పిల్లలు మట్టిముద్దల్లాంటి వారు. వారిని తల్లిదండ్రులు ఎలా మలిస్తే అలా తయారవుతారు

దేవుడు ప్రతీచోటా ఉండడు. అందుకే తల్లిదండ్రులను సృష్టించాడు.

దేవుడు ప్రతీచోటా ఉండడు. అందుకే తల్లిదండ్రులను సృష్టించాడు.తల్లిదండ్రులు ఆచరించినదే పిల్లలు అనుసరిస్తారు.

పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించే కంటే ఆచరిస్తే మంచిది, ఎందుకంటే తల్లిదండ్రులు ఆచరించినదే పిల్లలు అనుసరిస్తారు.   

పిల్లలెప్పుడూ తల్లిదండ్రులని గమనిస్తూనే ఉంటారు

పిల్లలెప్పుడూ తల్లిదండ్రులు ఏది చెప్పినా వినినా వినకపోయినా, వారు చేసే పనులను మాత్రం గమనిస్తూనే ఉంటారు.
తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధి కోరుకుంటారు

తల్లిదండ్రులు ఎంత వయసులో ఉన్నా మధ్య వయస్సున్న పిల్లలను చూసి వారు మరింత అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు.  (స్కాట్ మాక్స్వెల్)

ఆనందం అంటే ఏమిటో పిల్లలు తల్లిదండ్రులకి చూపిస్తారు.

పిల్లలకి జీవితంలో ఆనందం అంటే ఏమిటో చెప్పాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ జీవితంలో ఆనందం అంటే ఏమిటో పిల్లలు వారికి చూపిస్తారు.

Sunday, November 13, 2016

పిల్లల నుండి తల్లిదండ్రులు గుప్పెడు ప్రేమను కోరుకుంటారు.

పిల్లల నుండి తల్లిదండ్రులు ఎప్పుడూ పట్టెడన్నం కోరుకోరు. గుప్పెడు ప్రేమను మాత్రమే కోరుకుంటారు. (ఎర్మినియో)

తల్లిదండ్రుల పట్ల వారి పిల్లలు విముఖత చూపలేదు అంటే

తల్లిదండ్రుల పట్ల వారి పిల్లలు జీవితంలో ఏ ఒక్కసారైనా విముఖత చూపలేదు అంటే ..... వారు నిజమైన తల్లిదండ్రులు కాలేదని అర్థం. (బెట్టీ డేవిస్)పిల్లలకి తల్లిదండ్రులు దైవం కంటే కూడా ఎక్కువ

పిల్లలకి తల్లిదండ్రులు గొప్ప మనిషి కంటే, దైవం కంటే కూడా ఎక్కువ. అది ఇప్పటికి ఎప్పటికీ కూడా. (హడ్సన్)

తల్లిదండ్రుల ఆనందానికి - బాధకి కారణం పిల్లలే

తల్లిదండ్రుల ఆనందానికి - బాధకి కారణం పిల్లలే. పిల్లలపై వాళ్ళు అరవనూలేరు, అరిపించుకోనూలేరు (ఫ్రాన్సిస్ బేకన్)

పిల్లల భయాందోళనలకు ఎక్కువ కారణం తల్లిదండ్రులే

పిల్లల భయాందోళనలకు ఎక్కువ కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే పిల్లలు వారిని దేవుని స్థానంలో చూస్తారు. (కాస్టిలాగో)

తల్లిదండ్రుల్లాగా మాత్రమే ప్రవర్తించటం అవసరం

తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లల దగ్గర తల్లిదండ్రుల్లాగా మాత్రమే ప్రవర్తించటం అవసరం. (ఫ్రాన్సెస్ కిష్)

ప్రతీ మనిషి తన తల్లిదండ్రుల పట్ల దయతో ఉండాలి.

ప్రతీ మనిషి తన తల్లిదండ్రుల పట్ల దయతో ఉండాలి. (విలియం ఫాక్నర్)

పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్పిన చిరాకుపడతారు.

పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్పిన చిరాకుపడతారు. మనం మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎలా చిరాకు పడ్డామో అలా. అది మానవ సహజం. (సోమర్సెట్ మామ్)

 

తల్లిదండ్రుల మాట దేవుని మాటతో సమానం

తల్లిదండ్రుల మాట దేవుని మాటతో సమానం. పిల్లలకు వారు దైవం పంపిన సైనికులు
(షేక్స్పియర్)

పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం

పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. అంతే కాదు కాలాతీతం కూడా. (ఫీబర్)

Sunday, January 17, 2016

బొమ్మలపెండ్లి

బొమ్మలపెండ్లి ................... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
(బాలికలు చందనపు బొమ్మలకు పెండ్లితంతు నడిపింతురు. అప్పుడీ పదము పాడుదురు.)చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శృంగారవాకిళ్లు సిరితోరణాలు;
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్నపెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పొన్నేఱునీళ్లు.
కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర,
తొడుగుదునె బొమ్మ, నీకు తోపంచురవిక,
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
అత్తవారింటికీ పోయి రమ్మందు.అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ!
మామచెప్పినపనీ మానకే బొమ్మ!
రావాకుచిలకమ్మ ఆడవే పాప!
రాజుల్లు నీచెయ్ది చూడవచ్చేరు.

ప్రధానపుంగరం పమిడివత్తుల్లు
గణగణగ వాయిస్తు గంటవాయిస్తు,
గజంబరాయడూ తల్లి రాగాను,
తల్లి ముందరనిలచి యిట్లన్ని పలికె.
అన్న అందలమెక్కి, తాగుఱ్ఱమెక్కి,
గుఱ్ఱమ్ముమీదను పల్లమున్నాది,
పల్లమ్ముమీదను బాలుడున్నాడు,
బాలుడి ముందరికి కూతుర్నిదేరె,
కూతురిసిగలోకి కురువేరు దేరె,
నాకొక్క ముత్యాలబొట్టు దేరమ్మ!
బొట్టుకు బొమ్మంచు చీర దేరమ్మ!
చీరకు చిలకల్ల రవికె దేరమ్మ!
రవికకు రత్నాలపేరు దేరమ్మ!
పేరుకు పెట్టెల్ల సొమ్ము దేరమ్మ!

చిన్నన్న దెచ్చాడు చింతాకుచీర,
పెద్దన్న తెచ్చాడు పెట్టెల్ల సొమ్ము,
రావాకు చిలకతో ఆడబోకమ్మ,
రాజుల్లు నీచెయిది చూడవచ్చేరు.
వీధిలో ముడివిప్పి ముడువబోకమ్మ,
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ,
పొరుగిళ్లకెప్పుడూ పోవకేబొమ్మ,
నలుగురీ నోళ్లల్లో నానకేబొమ్మ!

(ఈ బొమ్మల పెండ్లిళ్లలో వియ్యాల వారి విందులు, అలకలు,
మొదలుగాగల పెండ్లి మర్యాదలన్నీ నడుపుదురు.
ఇది భావికాలమందు వాస్తవముగా జరుగ బోయే
విషయములకు అభ్యాసకృత్య మనవచ్చును;
యాజ్ఞికుల శుష్కేష్టుల వంటిది. దీనిచే పసితనముననే
బాలికలకు, కులాచార సంప్రదాయములందు ప్రవేశ
మేర్పడును. ఈ యలవాటుచే నటు తర్వాత వానిని చక్కగా
జరుపుకో గల్గుదురు.)

ఎండావానా పెళ్లాడే,
ఎడవల్లప్పయ్య యాజ్ఞీకుడు!
(ఎండ కాస్తుండగానే, వాన కురుస్తున్నప్పుడు పాడే పాట)మంచిమాటలు

మంచిమాటలు .................. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


ఒంటికణతా నొప్పి
ఒరగాలితీపు
పంటిపోటూ వద్దు
పగవానికైన.

విద్య లేకుంటేను
విభవమ్ము రోత;
వినయమ్ము లేకుంటె
విద్యలూ రోత.

నిదురలో ప్రాణమ్ము
అదరునో యేమొ;
నిష్ఠురా లేలమ్మ
కష్టజీవులపై?

ఓ చేడెకూ తగిలె
మోచేతిదెబ్బ;
అత్తింటి సౌఖ్యమని
అంగలార్చింది.మారుతల్లీ చేత
మాటపడలేక,
సారంగధరుడమ్మ
చావు కొప్పాడు.
కృష్ణమ్మ వంటి వాడు
కొడు కొకడు పుడితే
కష్టాలు కడతేరు
కన్నతల్లులకు.
బియ్యమ్ము తెల్లన్న, పిండి తెల్లన్న,
వరుస తప్పినవాని వలికి తెల్లన్న,
వరుసగానీదాన్ని వరుసలాడేవు
పాపాత్మ! నీశిరసు పక్కున్న పగులు.

కాలినిండా గుడ్డ వెయ్యంది రోత,
కానివాళ్ల కన్నెత్తి చూచింది రోత,
మంచిగంధపుచెక్క సాననే చీకు,
మంచాలిదేహమ్ము మనసులో చీకు.

ఆయుస్సు మూడినను
ఆకు చిరిగినను,
బ్రతికించువా రెవరు?
అతుకువా రెవరు?


ఒప్పులకుప్ప

ఒప్పులకుప్ప ............. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


ఒప్పులకుప్పా,
ఒయ్యారిభామ!
సన్నబియ్యం,
చాయపప్పు;
చిన్నమువ్వ,
సన్నగాజు;
కొబ్బరి కోరు,
బెల్లపచ్చు;
గూట్లో రూపాయి,
నీ మొగుడు సిపాయి;
రోట్లో తవుడు,
నీ మొగు డెవడు?


చదువుసందెలు

చదువుసందెలు ............... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు


విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయిదండాలు.

ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!
పిల్లలందరు రండి
బళ్లోకిపోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.

విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.


అరటిపండూ తీపి, ఆవుపాల్‌ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.

చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.

చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.

పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.

చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమబ్బేను.


దాగుడుమూతలు

దాగుడుమూతలు ............. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

దాగుడుమూతా దండాకోర్‌,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్‌చిప్‌ - సాంబారుబుడ్డి.శ్రీరాములవారు

శ్రీరాములవారు ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారుఉత్తముని పేరేమి?
ఊరి పేరేమి?
సత్యపురుషులగన్న
సాధ్వి పేరేమి?

ఉత్తముడు దశరథుడు,
ఊరు అయోధ్య!
సత్యపురుషులగన్న
సాధ్వి కౌసల్య.

ఇల్లాళ్ళు ముగ్గురే
ఈ దశరథునకు;
పిల్లాళ్లు నలుగురే
పేరు గలవారు.

అయ్యోధ్యలో వారు
అంద రున్నారు;
సయ్యోధ్యలో వారు
సరిలేని వారు.

శ్రీరామ! జయరామ! శృంగారరామ!
కారుణ్య గుణధామ! కల్యాణనామ!
జగతిపై రామయ్య జన్మించినాడు,
సత్యమ్ము లోకాన స్థాపించినాడు.

తల్లిదండ్రులమాట చెల్లించినాడు,
ఇల్లాలితోపాటు హింసపడ్డాడు,
సీతామహాదేవి సృష్టిలోపలను,
మాతల్లి వెలసింది మహనీయురాలు.

అయ్యోధ్యరామయ్య అన్నయ్య మాకు,
వాలుగన్నులసీత వదినమ్మ మాకు.
రాములంతటివాడు రట్టుపడ్డాడు,
మానవులకెట్లమ్మ మాటపడకుండ!
సీతమ్మ రామయ్య దారిగదిలీతె,
పారిజాతపు పువులు పలవరించినవి.
సీతపుట్టగనేల! లంకచెడనేల?
లంకకు విభీషణుడు రాజుగానేల?
ఏడు ఏడూ యేండ్లు పదునాలుగేండ్లు,
ఎట్టులుంటివి సీత నట్టడవిలోను?
లక్ష్మయ్య నామరిది రక్షిస్తూఉండ,
నాకేమి భయ మమ్మ, నట్టడవిలోను?
దేవునంతటివాడు జననింద పడెను,
మానవుం డెంతయ్య మాటపడకుండ?
అన్నదమ్ములులేక, ఆదరువులేక,
తోడులేకా సీత దూరమైపోయె.
దండమ్ము దండమ్ము దశరథరామ!
దయతోడ మముగావు దాక్షిణ్యధామ!

తాతపెండ్లి

తాతపెండ్లి ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ఊచకఱ్ఱోచేత, ఉగ్గమోచేత,
ఊగుతూ వచ్చిన్న తాతెవ్వరమ్మ?
మానికా నిండాను మాడ లోసుకుని,
మనుమరాలా నిన్ను మను మడగవస్తి;
వాడిన్నపూవుల్లు వాసనలు గలవా?
ఓతాత! ఈ మనుము వొద్దయ్య నాకు!నెత్తిమీద గోరింక

నెత్తిమీద గోరింక ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ఓఅ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక;
చెప్పకు చెప్పకు చెడిపోతావు,
చెప్పితే నీ ముక్కు తెగ్గోస్తా,
దూలంమీంచీ దూకిస్తా,
పందిరిమీంచీ పాకిస్తా,
కంచం అన్నం తినిపిస్తా,
కడివెడునీళ్లు తాగిస్తా!దోసపళ్ళు

దోసపళ్ళు

త్రోవలో ఒకరాజు తోటేసినాడు
తోటలోపల పండ్లు దొర్లుతున్నావి.
దొర్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని,
ఆ పండ్లు పంపాడు ఆరగించంగ.
తింటేను తియదోస పండ్లే తినాలి,
కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
అందితే అన్నతో వియ్యమందాలి.
ఆడితే వదినతో జగడమాడాలి.కన్నబిడ్డలు

కన్నబిడ్డలు

కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు?
కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు?
కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,
కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.

* * *
లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?
కొడుకులను గంటేను కోటి లాభమ్ము.
గోరంతదీపమ్ము కొండలకు వెలుగు,
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.
మాడంతదీపమ్ము మేడలకు వెలుగు,
మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు.

* * *
వీథిలో ఉయ్యాల అమ్మవచ్చింది,
కొడుకులను గన్నతల్లి కొనవె ఉయ్యాల.
కలువరేకుల కళ్ళు

కలువరేకుల కళ్ళు ...........శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు,
అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు.
కలువరేకులవంటి నీ కన్నులకును,
కాటుకలుపెట్టితే నీకు అందమ్ము.
ఏడువకు ఏడువకు వెఱ్ఱిఅబ్బాయి,
ఏడుస్తె నీకళ్ళు నీలాలు కారు.
నీలాలు కారితే నే జూడలేను,
పాలైన కారవే బంగారు కళ్ల.
చెమ్మచెక్క

చెమ్మచెక్క ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

చెమ్మచెక్క, చేరెడేసిమొగ్గ,
అట్లుపొయ్యంగ, ఆరగించంగ,
ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లెయ్యంగ,
రత్నాలచెమ్మచెక్క రంగు లెయ్యంగ,
పగడాల చెమ్మచెక్క పంది రెయ్యంగ,
పందిట్లో మాబావ పెండ్లి చెయ్యంగ,
చూచివద్దాం రండి, సుబ్బరాయుడు పెండ్లి,
(సూర్యదేవుడి పెండ్లి, చూచివద్దాం రండి,)
మావాళ్లింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి,
దొరగారింట్లో పెండ్లి,
దోచుకువద్దాం రండి.
గుడుగుడుకుంచం

గుడుగుడుకుంచం......... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 

గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టం పడిగేరాగం,
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే,
పేపేగుఱ్ఱం పెళ్లికిపోతే,
అన్నా! అన్నా! నీపెళ్లెపుడంటే
రేపుగాక, ఎల్లుండి.
-- కత్తీగాదు, బద్దాగాదు గప్‌, చిప్‌!
చలికంఠము

చలికంఠము ........శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారుచలి చలి చలి చందాయమ్మ,
గొంగళి గప్పుకో గోనాయమ్మ,
వడ వడ వడ వడ వణికేనమ్మ,
చలిమంటకు చితుకులు తేవమ్మ.


చిట్టిపొట్టి మిరియాలు

చిట్టిపొట్టి మిరియాలు ....... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

చిట్టిపొట్టి మిరియాలు
చెట్టుక్రింద పోసి
పుట్టమన్ను తెచ్చి,
బొమ్మరిల్లు కట్టి,
బొమ్మరింట్లో
బోగం పాప కన్నది.
బిడ్డతలకు చమురులేదు,
నా తలకు నూనెలేదు,
అల్లవారింటికి
చల్లకుపోతే
కలవారి కుక్క
భౌవ్‌ మన్నది!
నాకాళ్ల గజ్జెలు
ఘల్లుమన్నవి!!


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం! ....... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
గుఱ్ఱాల్‌ తిన్న గుగ్గిళ్లరిగి,
ఏనుగుల్‌ తిన్న వెలక్కాయలరిగి,
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి,
భీముడు తిన్న పిండివంటలరిగి,
గణపతి తిన్న ఖజ్జాలరిగి,
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి,
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి,
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు,
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ, యీ బిడ్డను సంజీవరాయా!