Sunday, January 17, 2016

బొమ్మలపెండ్లి

బొమ్మలపెండ్లి ................... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
(బాలికలు చందనపు బొమ్మలకు పెండ్లితంతు నడిపింతురు. అప్పుడీ పదము పాడుదురు.)చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శృంగారవాకిళ్లు సిరితోరణాలు;
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్నపెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పొన్నేఱునీళ్లు.
కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర,
తొడుగుదునె బొమ్మ, నీకు తోపంచురవిక,
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
అత్తవారింటికీ పోయి రమ్మందు.అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ!
మామచెప్పినపనీ మానకే బొమ్మ!
రావాకుచిలకమ్మ ఆడవే పాప!
రాజుల్లు నీచెయ్ది చూడవచ్చేరు.

ప్రధానపుంగరం పమిడివత్తుల్లు
గణగణగ వాయిస్తు గంటవాయిస్తు,
గజంబరాయడూ తల్లి రాగాను,
తల్లి ముందరనిలచి యిట్లన్ని పలికె.
అన్న అందలమెక్కి, తాగుఱ్ఱమెక్కి,
గుఱ్ఱమ్ముమీదను పల్లమున్నాది,
పల్లమ్ముమీదను బాలుడున్నాడు,
బాలుడి ముందరికి కూతుర్నిదేరె,
కూతురిసిగలోకి కురువేరు దేరె,
నాకొక్క ముత్యాలబొట్టు దేరమ్మ!
బొట్టుకు బొమ్మంచు చీర దేరమ్మ!
చీరకు చిలకల్ల రవికె దేరమ్మ!
రవికకు రత్నాలపేరు దేరమ్మ!
పేరుకు పెట్టెల్ల సొమ్ము దేరమ్మ!

చిన్నన్న దెచ్చాడు చింతాకుచీర,
పెద్దన్న తెచ్చాడు పెట్టెల్ల సొమ్ము,
రావాకు చిలకతో ఆడబోకమ్మ,
రాజుల్లు నీచెయిది చూడవచ్చేరు.
వీధిలో ముడివిప్పి ముడువబోకమ్మ,
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ,
పొరుగిళ్లకెప్పుడూ పోవకేబొమ్మ,
నలుగురీ నోళ్లల్లో నానకేబొమ్మ!

(ఈ బొమ్మల పెండ్లిళ్లలో వియ్యాల వారి విందులు, అలకలు,
మొదలుగాగల పెండ్లి మర్యాదలన్నీ నడుపుదురు.
ఇది భావికాలమందు వాస్తవముగా జరుగ బోయే
విషయములకు అభ్యాసకృత్య మనవచ్చును;
యాజ్ఞికుల శుష్కేష్టుల వంటిది. దీనిచే పసితనముననే
బాలికలకు, కులాచార సంప్రదాయములందు ప్రవేశ
మేర్పడును. ఈ యలవాటుచే నటు తర్వాత వానిని చక్కగా
జరుపుకో గల్గుదురు.)

ఎండావానా పెళ్లాడే,
ఎడవల్లప్పయ్య యాజ్ఞీకుడు!
(ఎండ కాస్తుండగానే, వాన కురుస్తున్నప్పుడు పాడే పాట)మంచిమాటలు

మంచిమాటలు .................. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


ఒంటికణతా నొప్పి
ఒరగాలితీపు
పంటిపోటూ వద్దు
పగవానికైన.

విద్య లేకుంటేను
విభవమ్ము రోత;
వినయమ్ము లేకుంటె
విద్యలూ రోత.

నిదురలో ప్రాణమ్ము
అదరునో యేమొ;
నిష్ఠురా లేలమ్మ
కష్టజీవులపై?

ఓ చేడెకూ తగిలె
మోచేతిదెబ్బ;
అత్తింటి సౌఖ్యమని
అంగలార్చింది.మారుతల్లీ చేత
మాటపడలేక,
సారంగధరుడమ్మ
చావు కొప్పాడు.
కృష్ణమ్మ వంటి వాడు
కొడు కొకడు పుడితే
కష్టాలు కడతేరు
కన్నతల్లులకు.
బియ్యమ్ము తెల్లన్న, పిండి తెల్లన్న,
వరుస తప్పినవాని వలికి తెల్లన్న,
వరుసగానీదాన్ని వరుసలాడేవు
పాపాత్మ! నీశిరసు పక్కున్న పగులు.

కాలినిండా గుడ్డ వెయ్యంది రోత,
కానివాళ్ల కన్నెత్తి చూచింది రోత,
మంచిగంధపుచెక్క సాననే చీకు,
మంచాలిదేహమ్ము మనసులో చీకు.

ఆయుస్సు మూడినను
ఆకు చిరిగినను,
బ్రతికించువా రెవరు?
అతుకువా రెవరు?


ఒప్పులకుప్ప

ఒప్పులకుప్ప ............. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 


ఒప్పులకుప్పా,
ఒయ్యారిభామ!
సన్నబియ్యం,
చాయపప్పు;
చిన్నమువ్వ,
సన్నగాజు;
కొబ్బరి కోరు,
బెల్లపచ్చు;
గూట్లో రూపాయి,
నీ మొగుడు సిపాయి;
రోట్లో తవుడు,
నీ మొగు డెవడు?


చదువుసందెలు

చదువుసందెలు ............... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు


విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయిదండాలు.

ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!
పిల్లలందరు రండి
బళ్లోకిపోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.

విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.


అరటిపండూ తీపి, ఆవుపాల్‌ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.

చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.

చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.

పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.

చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమబ్బేను.


దాగుడుమూతలు

దాగుడుమూతలు ............. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

దాగుడుమూతా దండాకోర్‌,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్‌చిప్‌ - సాంబారుబుడ్డి.శ్రీరాములవారు

శ్రీరాములవారు ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారుఉత్తముని పేరేమి?
ఊరి పేరేమి?
సత్యపురుషులగన్న
సాధ్వి పేరేమి?

ఉత్తముడు దశరథుడు,
ఊరు అయోధ్య!
సత్యపురుషులగన్న
సాధ్వి కౌసల్య.

ఇల్లాళ్ళు ముగ్గురే
ఈ దశరథునకు;
పిల్లాళ్లు నలుగురే
పేరు గలవారు.

అయ్యోధ్యలో వారు
అంద రున్నారు;
సయ్యోధ్యలో వారు
సరిలేని వారు.

శ్రీరామ! జయరామ! శృంగారరామ!
కారుణ్య గుణధామ! కల్యాణనామ!
జగతిపై రామయ్య జన్మించినాడు,
సత్యమ్ము లోకాన స్థాపించినాడు.

తల్లిదండ్రులమాట చెల్లించినాడు,
ఇల్లాలితోపాటు హింసపడ్డాడు,
సీతామహాదేవి సృష్టిలోపలను,
మాతల్లి వెలసింది మహనీయురాలు.

అయ్యోధ్యరామయ్య అన్నయ్య మాకు,
వాలుగన్నులసీత వదినమ్మ మాకు.
రాములంతటివాడు రట్టుపడ్డాడు,
మానవులకెట్లమ్మ మాటపడకుండ!
సీతమ్మ రామయ్య దారిగదిలీతె,
పారిజాతపు పువులు పలవరించినవి.
సీతపుట్టగనేల! లంకచెడనేల?
లంకకు విభీషణుడు రాజుగానేల?
ఏడు ఏడూ యేండ్లు పదునాలుగేండ్లు,
ఎట్టులుంటివి సీత నట్టడవిలోను?
లక్ష్మయ్య నామరిది రక్షిస్తూఉండ,
నాకేమి భయ మమ్మ, నట్టడవిలోను?
దేవునంతటివాడు జననింద పడెను,
మానవుం డెంతయ్య మాటపడకుండ?
అన్నదమ్ములులేక, ఆదరువులేక,
తోడులేకా సీత దూరమైపోయె.
దండమ్ము దండమ్ము దశరథరామ!
దయతోడ మముగావు దాక్షిణ్యధామ!

తాతపెండ్లి

తాతపెండ్లి ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ఊచకఱ్ఱోచేత, ఉగ్గమోచేత,
ఊగుతూ వచ్చిన్న తాతెవ్వరమ్మ?
మానికా నిండాను మాడ లోసుకుని,
మనుమరాలా నిన్ను మను మడగవస్తి;
వాడిన్నపూవుల్లు వాసనలు గలవా?
ఓతాత! ఈ మనుము వొద్దయ్య నాకు!నెత్తిమీద గోరింక

నెత్తిమీద గోరింక ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ఓఅ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక;
చెప్పకు చెప్పకు చెడిపోతావు,
చెప్పితే నీ ముక్కు తెగ్గోస్తా,
దూలంమీంచీ దూకిస్తా,
పందిరిమీంచీ పాకిస్తా,
కంచం అన్నం తినిపిస్తా,
కడివెడునీళ్లు తాగిస్తా!దోసపళ్ళు

దోసపళ్ళు

త్రోవలో ఒకరాజు తోటేసినాడు
తోటలోపల పండ్లు దొర్లుతున్నావి.
దొర్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని,
ఆ పండ్లు పంపాడు ఆరగించంగ.
తింటేను తియదోస పండ్లే తినాలి,
కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
అందితే అన్నతో వియ్యమందాలి.
ఆడితే వదినతో జగడమాడాలి.కన్నబిడ్డలు

కన్నబిడ్డలు

కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు?
కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు?
కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,
కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.

* * *
లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?
కొడుకులను గంటేను కోటి లాభమ్ము.
గోరంతదీపమ్ము కొండలకు వెలుగు,
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.
మాడంతదీపమ్ము మేడలకు వెలుగు,
మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు.

* * *
వీథిలో ఉయ్యాల అమ్మవచ్చింది,
కొడుకులను గన్నతల్లి కొనవె ఉయ్యాల.
కలువరేకుల కళ్ళు

కలువరేకుల కళ్ళు ...........శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు,
అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు.
కలువరేకులవంటి నీ కన్నులకును,
కాటుకలుపెట్టితే నీకు అందమ్ము.
ఏడువకు ఏడువకు వెఱ్ఱిఅబ్బాయి,
ఏడుస్తె నీకళ్ళు నీలాలు కారు.
నీలాలు కారితే నే జూడలేను,
పాలైన కారవే బంగారు కళ్ల.
చెమ్మచెక్క

చెమ్మచెక్క ........... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

చెమ్మచెక్క, చేరెడేసిమొగ్గ,
అట్లుపొయ్యంగ, ఆరగించంగ,
ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లెయ్యంగ,
రత్నాలచెమ్మచెక్క రంగు లెయ్యంగ,
పగడాల చెమ్మచెక్క పంది రెయ్యంగ,
పందిట్లో మాబావ పెండ్లి చెయ్యంగ,
చూచివద్దాం రండి, సుబ్బరాయుడు పెండ్లి,
(సూర్యదేవుడి పెండ్లి, చూచివద్దాం రండి,)
మావాళ్లింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి,
దొరగారింట్లో పెండ్లి,
దోచుకువద్దాం రండి.
గుడుగుడుకుంచం

గుడుగుడుకుంచం......... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 

గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టం పడిగేరాగం,
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే,
పేపేగుఱ్ఱం పెళ్లికిపోతే,
అన్నా! అన్నా! నీపెళ్లెపుడంటే
రేపుగాక, ఎల్లుండి.
-- కత్తీగాదు, బద్దాగాదు గప్‌, చిప్‌!
చలికంఠము

చలికంఠము ........శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారుచలి చలి చలి చందాయమ్మ,
గొంగళి గప్పుకో గోనాయమ్మ,
వడ వడ వడ వడ వణికేనమ్మ,
చలిమంటకు చితుకులు తేవమ్మ.


చిట్టిపొట్టి మిరియాలు

చిట్టిపొట్టి మిరియాలు ....... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

చిట్టిపొట్టి మిరియాలు
చెట్టుక్రింద పోసి
పుట్టమన్ను తెచ్చి,
బొమ్మరిల్లు కట్టి,
బొమ్మరింట్లో
బోగం పాప కన్నది.
బిడ్డతలకు చమురులేదు,
నా తలకు నూనెలేదు,
అల్లవారింటికి
చల్లకుపోతే
కలవారి కుక్క
భౌవ్‌ మన్నది!
నాకాళ్ల గజ్జెలు
ఘల్లుమన్నవి!!


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం! ....... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
గుఱ్ఱాల్‌ తిన్న గుగ్గిళ్లరిగి,
ఏనుగుల్‌ తిన్న వెలక్కాయలరిగి,
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి,
భీముడు తిన్న పిండివంటలరిగి,
గణపతి తిన్న ఖజ్జాలరిగి,
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి,
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి,
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు,
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ, యీ బిడ్డను సంజీవరాయా!


కాళ్లాగజ్జీ...

కాళ్లాగజ్జీ...........  శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

కాళ్లాగజ్జీ, కంకోలమ్మూ (గంగారమ్మా),
వేగులచుక్కా, వెలగామొగ్గ,
మొగ్గాకాదు, మోదుగనీరు,
నీరూగాదు, నిమ్మలవారి,
వారీగాదు, వావింటాకు (కూర),
కూరాగాదు, గుమ్మడిపండు,
పండూగాదు, పాపడిమీసం,
లింగూలిటుకు, పందిమాల్నిపటుకు,
రాజుగారితోట్లో యేముందంటే,
పువ్వో, మొగ్గో పుచ్చుకుంటే దెబ్బ,
కాల్దీసి కడగాబెట్టు.

ఉగ్గు

ఉగ్గు ....... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

ఊఁ ఊఁ ఉంగన్న,
ఉగ్గుపాలు ఇందన్న.

గుంటెడు ఉగ్గు కమ్మన్న,
ఉమ్మక కక్కక మింగన్న.

ఊఁ ఊఁ ఊఁ ఉంగన్న,
లుంగలు పెట్టకు గ్రుక్కన్న.

ఓర్వని సవతుల దిష్టన్న,
ఒప్పుగ మసలర బుచ్చన్న.

నేతిలో నేరేడుపండు

నేతిలో నేరేడుపండు ...... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

చిట్లపొట్లకాయ
సీమనెల్లికాయ
గోడపుచ్చకాయ
గొబ్బినెల్లికాయ
అత్తకు పెడితే అల్లం
నే తింటే బెల్లం
కొత్తకుండల్లోని గోధుమల్లారా!
పాలపిడతల్లోని పసిబిడ్డలార!
అమ్మ అమ్మ, నీ బిడ్డపేరేమంటే,
నీళ్లల్లో నిమ్మపండు,
పాలల్లో పనసపండు,
నేతిలో నేరేడుపండు.

మేలుకొలుపు

మేలుకొలుపు ....... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు


చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి!
చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు.

తెల్లవారొచ్చింది కోడి కూసింది,
చూచేటిఅక్కల్లు చూడరారమ్మ.

ఆడేటి అక్కల్లు ఆడరారమ్మ,
ఆడుకోరారమ్మ అక్కల్లు మీరు.

ఆడేటివారికి అచ్చావుపాలు,
పాడేటివారికి పాలు పంచదార.
వానా వానా వల్లప్ప!

వానా వానా వల్లప్ప! ........ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

వానా వానా వల్లప్ప!
వాకిలి తిరుగూ చెల్లప్ప!
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు?
వేపాకు పసుపూ,
వెల్లుల్లిపాయ,
నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)
నూటొక్కసారి,
పూయవోయి నూరి,
పూటకొక్కతూరి.

శ్రీసూర్యనారాయణా!

శ్రీసూర్యనారాయణా! ........ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు

పుట్టేటి భానుడా, పుష్యరాగపుచాయ
శ్రీసూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగుబంగరుచాయ
శ్రీసూర్యనారాయణా!
జామెక్కి భానుడా, జాజిపువ్వులచాయ
శ్రీసూర్యనారాయణా!
జాజిపూవులమీద సంపెంగపువుచాయ
శ్రీసూర్యనారాయణా!
మధ్యాహ్న భానుడా, మల్లెపూవులచాయ
శ్రీసూర్యనారాయణా!
మల్లెపూవులమీద మంచి వజ్రపుచాయ
శ్రీసూర్యనారాయణా!
మూడ్జాముల భానుడా, మునగపూవులచాయ
శ్రీసూర్యనారాయణా!
మునగపువ్వులమీద ముత్యాలపొడిచాయ
శ్రీసూర్యనారాయణా!
క్రుంకేటి భానుడా, గుమ్మడీపువుచాయ
శ్రీసూర్యనారాయణా!
గుమ్మడీపువుమీద కుంకుం పువుచాయ
శ్రీసూర్యనారాయణా!
ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
శ్రీసూర్యనారాయణా!


Saturday, January 16, 2016

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!

పిల్లల పద్యాలు  --- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 

1 చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!


చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!
అయ్య రారా! చక్కనయ్య రార!
అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
లాడ రార! కుల్కులాడ రార!


ప్రకీర్ణములు

ప్రకీర్ణములు

1)
దంపుదంపనగానె దం పెంతసేపు
ధాన్యరాసులమీద చెయి వేసినట్లు
వంటవంటనగానె వం టెంతసేపు
వదినెల్లు మరదల్లు వాదించినట్లు.

2)
అత్త పోసిన గంజి సత్తూవలేదు
అల్లూడు సిరిపురపు గట్టెక్కలేడు

3)
కోటీవేలా ధనమైన చాలు
గోపికృష్ణుడివంటి కొడుకైన చాలు
లక్షావేలా ధనమైన చాలు
లక్షణదేవరవంటి తమ్ముడైన చాలు.

4)
విశాఖపట్నాన వీధిగుమ్మాన
వింతరాచకొడుకు బంతులాడేడు
బంతివెళ్లి పాలకొండసభలో పడితే
యిది యెవరిబంతన్ని వివరించె రాజు
గోలకొండవారి గొలుసుల్ల బంతి
పాలకొండవారి పచ్చల్లబంతి
శ్రీకాకుళమువారి చిత్రాల బంతి
నెల్లూరివారిదే నీటైనబంతి
బొబ్బిల్లివారిదే బంగారుబంతి.

5)
ఓయిఓయిఓయి వడ్డాదిరాజ
పొడిచి గెలిచినరాజ బొబ్బిల్లిరాజ
బొబ్బిల్లి పొడుగాయె కిమిడి కిందాయె
మాడుగులు మనకాయె మళ్లుమీ రాజా.

6)
నరసన్నపేటలో భాగోతులాట
రాజు కూర్చున్నది రత్నాలపీట
పీటకిం దున్నది వరహాలమూట
ఆమూట మాకిస్తె మహమంచిమాట.

7)
కొయ్యతోటాకూర కొయ్యక్క చెడెను
కొండంత కాపురం కొండేల చెడెను.

8)
చిచ్చెమ్మ చినగాలి పెట్టు పెదగాలి
అయోధ్యవీధుల్లొ అణిగెనే గాలి.

9)
చలికి వెరిచినట్టు పులికి నే వెరువ
ఆలికి వెరిచినట్టు అమ్మ కీ వెరువ.

10)
పాటల్ల పచ్చడి రాగాలబుఱ్ఱ
నిత్తెకయ్యారిమారి మొగుణ్ణి పాడింది.

11)
కొడుకుల కననివాళ్ల కడు పేమి కడుపు
కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు.

12)
పిడికెడు వితనాలు మడికెల్ల జాలు
వక్కడే కొడుకైన వంశాన జాలు.

13)
కొత్తచింతపండు గోనెల్ల చివుకు
గొడ్రాలివస్త్రాలు పెట్టెల్ల చివుకు
దేవదారుచెక్క చెట్టున్న చివుకు
దేవూడివస్త్రాలు గుళ్ళోన చివుకు
రావిచెట్టు చెక్క రంపాన చివుకు
రంభచక్కాదనము దుఃఖాన్న చివుకు.

14)
నా చేతిరోకళ్లు నల్లరోకళ్లు
నే పాడిన అన్నల్లు రామలక్ష్మణులు
రామలక్ష్మణులాల్ల రక్షపతులాల్ల
మీ రెక్కు గుఱ్ఱాలు నీలమేఘాలు
మీచేతికత్తుల్లు చంద్రాయుధాలు

15)
ఎవ్వరే చుట్టాలు యెవరుపక్కాలు
ఎవ్వరే మాపాల కలిగివున్నారు
మాపాల శ్రీవెంకటప్ప వుండగను
మనసులో చింతేల మరిభయము లేల.

16)
సింహాద్రి అప్పన్న గుళ్లముందార
పడ్డారె గొడ్లాళ్లు ప్రాణచారమ్ము
ఎందూకు పడ్డారు యేల పడ్డారు
సంతాన మియ్యమని చాల పడ్డారు - సంతాన
బిడ్డల నియ్యమని ప్రియము పడ్డారు - బిడ్డల
కొమాళ్ల నియ్యమని కోరి పడ్డారు - కొమాళ్ల
సింహాద్రి అప్పన్నకు యేమి లంచమ్ము
గుడిదిరుగు వస్త్రము గుమ్మాడిపండు
దాగళ్ల వడపప్పు చండుబెల్లాలు.

పిల్లల పణతిపాటలు

పిల్లల పణతిపాటలు

1)
చుట్టు చక్కందమ్మ చక్కిలపుచుట్టు
చూలింత చక్కంది ఓరాచదేవి!
పండు చక్కందమ్మ పనసయ్యపండు
బాలింత చక్కంది ఓరాచదేవి!
ఆకు చక్కందమ్మ తామల్లపాకు
అయిదవ చక్కంది ఓరాచదేవి!
కొమ్మ చక్కందమ్మ గోరింటకొమ్మ
కొమరాలు చక్కంది ఓఅరాచదేవి!
పోక చక్కందమ్మ బొబ్బిల్లిపోక
బోగపుది చక్కంది ఓరాచదేవి!

2)
ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల!
తాటిమేకలచల్ల తాగడే గొల్ల
నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల
కవ్వాన్ని తిప్పింది కమ్మన్నిచల్ల.

3)
చిలకల్లు చిలకల్లు అందురే కాని
చిలకలకు రూపేమి పలుకులే కాని
హంసల్లు హంసల్లు అందురే కాని
హంసలకు రూపేమి ఆటలే కాని
పార్వాలు పార్వాలు అందురే కాని
పార్వాలకు రూపేమి పాటలేకని
కోయిల్లు కోయిల్లు అందురే కాని
కోయిలకు రూపేమి ఘోషలే కాని
చిలకల్లు మాయింటి చిన్నకోడల్లు
హంసల్లు మాయింటి ఆడపడుచుల్లు
పార్వాలు మాయింటి బాలపాపల్లు
కోయిల్లు మాయింటి కొత్తకోడల్లు.

4)
వండా రారమ్మ వడకవంటల్లు
వల్లభుడు అబ్బాయికి వడుగు మాయింట
కట్టా రారమ్మ కలవతోరణాలు
కాముడిఅబ్బాయి కల్యాణ మన్ని
పెట్టా రారమ్మ పెళ్లిముగ్గుల్లు
పెంపుడు అబ్బాయికి పెళ్లిమాయింట
తియ్యారారమ్మ చిప్పగంధాలు
సింహాలక్ష్మి అమ్మాయికి సీమంత మనిరి
పుయ్యా రారమ్మ పురిటిగోడల్లు
పుణ్యశాలి సీతమ్మకి పురుడు మా యింట.

5)
చింతచెట్టుకింద చికిలింతగడ్డి
మెయ్యదుగ మాఆవు పెయ్యల్ల కన్ని
ఆవుపాలు తెచ్చి పరమాన్నం వండి
కుడువదుగ మాఅమ్మి కూతుళ్లకన్ని.

6)
నీలాటిరేవంత నిగ్గు తేలింది
ఏచేడె కడిగింది యీచాయపసుపు
పచ్చిపసుపు బావల్ల మరదలాడింది
అణుప్పసుపు అన్నల్ల చెల్లెలాడింది
కొట్టుపసుపు కొమాళ్ల తల్లి యాడింది
కొమాళ్ల తల్లియే తాను గోపమ్మ
గొంతియాడిన పసుపు గోవపూఛాయ
అన్నల్లచెల్లెలే తాను అమ్మాయి
అతివె ఆడినపసుపు ఆవపూఛాయ
బావల్ల మరదలె తాను అమ్మాయి
పణతి ఆడినపసుపు బంగారుఛాయ.

పిల్లల ఆటపాటలు

పిల్లల ఆటపాటలు

1) గుడుగుడుగుంచం, గుండారాగం

గుడుగుడుగుంచం, గుండారాగం
పాములపట్నం, పడగారాగం
అత్తారిచెవులో ముత్యాలేస్తే
బయటికి రావే, పందికొక్కా.

2) కొంగకొంగ గోళ్లు
కొంగకొంగ గోళ్లు
రంగడిచేతి రాళ్లు
నాచేతి పూలు.
3) ఏనుగమ్మా ఏనుగు


ఏనుగమ్మా ఏనుగు
ఏవూ రెళ్లిం దేనుగు
మావూ రొచ్చిం దేనుగు
మంచినీళ్లు తాగిం దేనుగు
4) చెమ్మచెక్క చారెడేసిమొగ్గ
చెమ్మచెక్క చారెడేసిమొగ్గ
అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ.


5) బావాబావా పన్నీరు


బావాబావా పన్నీరు
బావని పట్టుకు తన్నేరు
వీధివీధి తిప్పేరు
వీసెడు గుద్దులు గుద్దేరు
పట్టిమంచం వేసేరు
పాతికగుద్దులు గుద్దేరు
నులకమంచం వేసేరు
నూరుగుద్దులు గుద్దేరు.