Wednesday, July 17, 2013

హాయమ్మ హాయీ ఆపదలు గాయీ:--

హాయమ్మ హాయీ ఆపదలు గాయీ:--

ఉళుళుళు హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..ఉళుళుళు

చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాలు త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు

ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిట్టి ముత్యము పుట్టె సీత కడుపున
స్వాతి వానలు కురిసె సంద్రాల మధ్య..ఉళుళుళు

అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడా రార బుట్టల్లుకోరా
బుట్టలో బాబును పట్టుకొని పోరా
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేంఢ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు..
ఉళుళుళు ఆయమ్మబాయమ్మ
అక్కచెల్లెళ్ళు తొలి ఒక్క జన్మాన తోడికోడళ్ళూ





జో అచ్యుతానంద జోజో ముకుందా:--

జో అచ్యుతానంద జోజో ముకుందా:--

జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో

తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ
నాలుగూ వేదాల గొలుసులమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలుల డోలికలలొన చేర్చి లాలించీ..జో జో

ముల్లోకములనేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
ఈ జన్మలో నాకు బిడ్డలైనారూ..జో జో





కాళ్ళాగజ్జ కంకాలమ్మ:--

కాళ్ళాగజ్జ కంకాలమ్మ:--

కాళ్ళాగజ్జ కంకాలమ్మ
వేగు చుక్కా వెలగామొగ్గా
మొగ్గా కాదూ మోదుగపువ్వు
పువ్వూ కాదు బావిలో నీరు 
నీరూ కాదూ నిమ్మల గడ్డ
గడ్డా కాదు చేలో వరీ
వారీ కాదూ వావింటాకు
ఆకూ కాదూ గుమ్మడి పండూ
పండూ కాదూ కాయా కాదూ
కాలూ తీసి గట్టు మీద పెట్టు.





నా పేరు జమిందారు

నా పేరు జమిందారు 

కాకీ కాకీ కడవల కాకీ 
కాకీ నాకు కడియాలిస్తే 
కడియం తెచ్చి అమ్మకు ఇస్తే 
అమ్మ నాకూ అటుకులు పెడితే 
అటుకులు తెచ్చి పంతులుకిస్తే
పంతులుగారు పాఠం చెబితే
మామా ముందూ పాఠం చదివితే
మామా నాకు పిల్లానిచ్చే
పిల్ల పేరు మల్లెమొగ్గ
నా పేరు జమిందారు... 





మా బావ వీరుడు

మా బావ వీరుడు 

మా బావ వీరుడు -- మంచం దిగడు
చీమంటే చాలు -- చిటికెలు వేస్తాడు 
తెలంటే చాలు -- చిందులేస్తాడు 
కాకంటె చాలు -- కర్ర తీస్తాడు 
ఎలుకంటే చాలు -- ఎగిరి పడతాడు
కుక్కంటే చాలు -- కిక్కురుమనడు
పిల్లి అంటే చాలు -- తుర్రుమని పారిపోతాడు

(బావలు ఉండేది ఎప్పుడూ డచ్చాలు కొట్టడానికే...... అదీ మరదళ్ళ దగ్గరే.... 
అసలు రంగు బయటపడితే ఇంతే సంగతులు)