Sunday, April 21, 2013

ఛల్ ఛల్ గుర్రం

ఛల్ ఛల్ గుర్రం 


ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం
సవారిచేస్తే చక్కని గుర్రం 
సాములు చేస్తే సర్కస్ గుర్రం
పౌరుషముంటే పందెపు గుర్రం
ఆగకపోతే అరబ్బీ గుర్రం
చచ్చుది అయితే జట్కా గుర్రం



బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి ?

బుజ్జిమేక



బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి ?

రాజుగారి తోటలోన మేతకెల్తిని 


రాజుగారితోటలోన ఏమి చూస్తివి ?


రాణిగారి పూలచెట్లు సొగసు చూస్తిని 

పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా ?

నోరూరగ పూలచెట్లు మేసివస్తిని 

మేసివస్తే నిన్ను భటులు ఏమి చేసిరి ?

భటులు వచ్చి నా కాళ్ళు విరగగోట్టిరి 

కాలువిరిగిన నీవు ఊరకుంటివా ?

మందుకోసం డాక్టరింటికెల్తిని 

మందు ఇచ్చిన డాక్టరకు ఏమి ఇస్తివి ?

చిక్కనైన తెల్లపాలు అంది ఇస్తిని 

ఉన్నపాలు డాక్టరకిస్తే యజమానికేమి ఇస్తివి ?

గడ్డితినక ఒకపూట పస్తులుండి తీరుస్తా 

పస్తులుంటే నీకు నీరసం రాదా ?

పాడుపని చేయనింక బుద్ధివచ్చె నాకు


ఆదివారంనాడు - అరటి మొలిచింది

అరటి మొలిచింది 


ఆదివారంనాడు - అరటి మొలిచింది 

సోమవారంనాడు - సుడివేసి పెరిగింది 


మంగళవారంనాడు - మారాకు తొడిగింది 

బుధవారంనాడు - పొట్టిగెల వేసింది

గురువారంనాడు - గుబురులో దాగింది

శుక్రవారంనాడు - పచ్చగా పండింది

శనివారంనాడు - చకచకా గెలకోసి

అబ్బాయి అమ్మాయి - అరటి పండ్లివిగో

అందరికి పంచితిమి - అరటి అత్తములు



చిట్టిచీమ చిట్టిచీమ ఎక్కడికెళ్ళావు

చిట్టి చీమ 

చిట్టిచీమ చిట్టిచీమ ఎక్కడికెళ్ళావు 
చిట్టిపాప పుట్టినరోజు విందుకెళ్ళాను


విందుకెళ్ళి చిట్టిచీమ ఏం చేశావు 

చిట్టి పాప బుగ్గ పైన పెట్టాను 


ముద్దు పెట్టి చిట్టిచీమ ఏమి చేసావు 

పొట్టనిండా పాయసం మెక్కి వచ్చాను




ఉడుతా ఉడుతా ఓ ఉడుతా

ఉడుతా ఓ ఉడుతా 


ఉడుతా ఉడుతా ఓ ఉడుతా 
దిగివస్తావా మిటాయి పెడతా 


చెట్లు ఎక్కటం ఎట్లాగో - గుట్టు విప్పి చెబుతావా 

కొమ్మల్లో తిరగటం ఎట్లాగో - నెమ్మదిగా వివరిస్తావా 



చిటారు కొమ్మన ఉంటావు - హటాత్తుగా దిగి వస్తావు 
చప్పుడు కొంచెం వినబడితే - చిటుక్కున తప్పుకుంటావు

ఆ చిట్కాలేవో చెబుతావా - చిటారుకొమ్మకు చేరెదను 
మెలకువలన్నీ చెబుతావా - మిటాయి నీకు తినిపిస్తా


చిక్ చిక్ రైలు

చిక్ చిక్ రైలు



చిక్ చిక్ రైలు వస్తుందీ 

దూరం దూరం జరగండి

స్టేషనులోన ఆగింది 

ఆగిన రైలు ఎక్కండి 

పచ్చ లైటు చూసింది 

కూత వేసి కదిలింది 

జోజో పాపాయి ఏడవకు 

బొమ్మలు ఎన్నో కొనిపెడతా 

లడ్డూ మిటాయి తినిపిస్తా 

కమ్మని కాఫీ తాగిస్తా


బుర్రుపిట్ట

బుర్రుపిట్ట 


బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది 

పడమటింటి కాపురం చెయ్యనన్నది 

అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది 


మామ తెచ్చిన మల్లెమొగ్గ ముడవనన్నది 

మొగునిచేత మొట్టికాయలు తింటానన్నది



గాలిపటం

గాలిపటం 


ఎగిరింది - నా గాలిపటం
ఎగిరింది ఎగిరింది - నా గాలిపటం 
గాలిలో పైపైకి ఎగిరింది - నా గాలిపటం 
పల్టీలు కొట్టింది - నా గాలిపటం 
రంగురంగులదండి - నా గాలిపటం
రాజ్యాలు దాటింది - నా గాలిపటం
మబ్బును తాకింది - నా గాలిపటం
పందెమే గెలిచింది - నా గాలిపటం



బడాయి పిల్లి

బడాయి పిల్లి


బడాయి పిల్లి లడాయి కెళ్ళి 
మిడుతను చంపి ఉడుత అన్నది
ఉడుతను చంపి ఉడుం అన్నది 
ఎలుకను చంపి ఏనుగు అంది 
సింహం తానని పొంగిన పిల్లి 
కుక్కను చూచి ఒకటే పరుగు


ఏనుగమ్మ ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు



ఏనుగమ్మ ఏనుగు - ఏంతో పెద్ద ఏనుగు 
చిన్ని కళ్ళ ఏనుగు - నాలుగు కాళ్ళ ఏనుగు 
చిన్న తోక ఏనుగు - చేట చెవుల ఏనుగు 
తెల్ల కొమ్ముల ఏనుగు - పెద్ద తొండం ఏనుగు
దేవుని గుళ్ళో ఏనుగు - దీవేనలిచ్చే ఏనుగు



అమ్మకు జేజేలు

అమ్మకు జేజేలు 


అమ్మకు జేజేలు - నాన్నకు జేజేలు 

చదువులు నేర్పే - గురువుకు జేజేలు 

ఎండను ఇచ్చే - సూర్యునకు జేజేలు 

వెన్నెలనిచ్చే - జాబిలికి జేజేలు 

వానలనిచ్చే - మబ్బుకు జేజేలు 

ధాన్యమునిచ్చే - భూదేవికి జేజేలు