Sunday, January 17, 2016

చదువుసందెలు

చదువుసందెలు ............... శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు


విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయిదండాలు.

ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.



చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!
పిల్లలందరు రండి
బళ్లోకిపోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.

విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.


అరటిపండూ తీపి, ఆవుపాల్‌ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.

చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.

చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.

పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.

చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమబ్బేను.


No comments:

Post a Comment