పిల్లల పణతిపాటలు
1)
చుట్టు చక్కందమ్మ చక్కిలపుచుట్టు
చూలింత చక్కంది ఓరాచదేవి!
పండు చక్కందమ్మ పనసయ్యపండు
బాలింత చక్కంది ఓరాచదేవి!
ఆకు చక్కందమ్మ తామల్లపాకు
అయిదవ చక్కంది ఓరాచదేవి!
కొమ్మ చక్కందమ్మ గోరింటకొమ్మ
కొమరాలు చక్కంది ఓఅరాచదేవి!
పోక చక్కందమ్మ బొబ్బిల్లిపోక
బోగపుది చక్కంది ఓరాచదేవి!
2)
ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల!
తాటిమేకలచల్ల తాగడే గొల్ల
నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల
కవ్వాన్ని తిప్పింది కమ్మన్నిచల్ల.
3)
చిలకల్లు చిలకల్లు అందురే కాని
చిలకలకు రూపేమి పలుకులే కాని
హంసల్లు హంసల్లు అందురే కాని
హంసలకు రూపేమి ఆటలే కాని
పార్వాలు పార్వాలు అందురే కాని
పార్వాలకు రూపేమి పాటలేకని
కోయిల్లు కోయిల్లు అందురే కాని
కోయిలకు రూపేమి ఘోషలే కాని
చిలకల్లు మాయింటి చిన్నకోడల్లు
హంసల్లు మాయింటి ఆడపడుచుల్లు
పార్వాలు మాయింటి బాలపాపల్లు
కోయిల్లు మాయింటి కొత్తకోడల్లు.
4)
వండా రారమ్మ వడకవంటల్లు
వల్లభుడు అబ్బాయికి వడుగు మాయింట
కట్టా రారమ్మ కలవతోరణాలు
కాముడిఅబ్బాయి కల్యాణ మన్ని
పెట్టా రారమ్మ పెళ్లిముగ్గుల్లు
పెంపుడు అబ్బాయికి పెళ్లిమాయింట
తియ్యారారమ్మ చిప్పగంధాలు
సింహాలక్ష్మి అమ్మాయికి సీమంత మనిరి
పుయ్యా రారమ్మ పురిటిగోడల్లు
పుణ్యశాలి సీతమ్మకి పురుడు మా యింట.
5)
చింతచెట్టుకింద చికిలింతగడ్డి
మెయ్యదుగ మాఆవు పెయ్యల్ల కన్ని
ఆవుపాలు తెచ్చి పరమాన్నం వండి
కుడువదుగ మాఅమ్మి కూతుళ్లకన్ని.
6)
నీలాటిరేవంత నిగ్గు తేలింది
ఏచేడె కడిగింది యీచాయపసుపు
పచ్చిపసుపు బావల్ల మరదలాడింది
అణుప్పసుపు అన్నల్ల చెల్లెలాడింది
కొట్టుపసుపు కొమాళ్ల తల్లి యాడింది
కొమాళ్ల తల్లియే తాను గోపమ్మ
గొంతియాడిన పసుపు గోవపూఛాయ
అన్నల్లచెల్లెలే తాను అమ్మాయి
అతివె ఆడినపసుపు ఆవపూఛాయ
బావల్ల మరదలె తాను అమ్మాయి
పణతి ఆడినపసుపు బంగారుఛాయ.
No comments:
Post a Comment