Saturday, January 16, 2016

ప్రకీర్ణములు

ప్రకీర్ణములు

1)
దంపుదంపనగానె దం పెంతసేపు
ధాన్యరాసులమీద చెయి వేసినట్లు
వంటవంటనగానె వం టెంతసేపు
వదినెల్లు మరదల్లు వాదించినట్లు.

2)
అత్త పోసిన గంజి సత్తూవలేదు
అల్లూడు సిరిపురపు గట్టెక్కలేడు

3)
కోటీవేలా ధనమైన చాలు
గోపికృష్ణుడివంటి కొడుకైన చాలు
లక్షావేలా ధనమైన చాలు
లక్షణదేవరవంటి తమ్ముడైన చాలు.

4)
విశాఖపట్నాన వీధిగుమ్మాన
వింతరాచకొడుకు బంతులాడేడు
బంతివెళ్లి పాలకొండసభలో పడితే
యిది యెవరిబంతన్ని వివరించె రాజు
గోలకొండవారి గొలుసుల్ల బంతి
పాలకొండవారి పచ్చల్లబంతి
శ్రీకాకుళమువారి చిత్రాల బంతి
నెల్లూరివారిదే నీటైనబంతి
బొబ్బిల్లివారిదే బంగారుబంతి.

5)
ఓయిఓయిఓయి వడ్డాదిరాజ
పొడిచి గెలిచినరాజ బొబ్బిల్లిరాజ
బొబ్బిల్లి పొడుగాయె కిమిడి కిందాయె
మాడుగులు మనకాయె మళ్లుమీ రాజా.

6)
నరసన్నపేటలో భాగోతులాట
రాజు కూర్చున్నది రత్నాలపీట
పీటకిం దున్నది వరహాలమూట
ఆమూట మాకిస్తె మహమంచిమాట.

7)
కొయ్యతోటాకూర కొయ్యక్క చెడెను
కొండంత కాపురం కొండేల చెడెను.

8)
చిచ్చెమ్మ చినగాలి పెట్టు పెదగాలి
అయోధ్యవీధుల్లొ అణిగెనే గాలి.

9)
చలికి వెరిచినట్టు పులికి నే వెరువ
ఆలికి వెరిచినట్టు అమ్మ కీ వెరువ.

10)
పాటల్ల పచ్చడి రాగాలబుఱ్ఱ
నిత్తెకయ్యారిమారి మొగుణ్ణి పాడింది.

11)
కొడుకుల కననివాళ్ల కడు పేమి కడుపు
కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు.

12)
పిడికెడు వితనాలు మడికెల్ల జాలు
వక్కడే కొడుకైన వంశాన జాలు.

13)
కొత్తచింతపండు గోనెల్ల చివుకు
గొడ్రాలివస్త్రాలు పెట్టెల్ల చివుకు
దేవదారుచెక్క చెట్టున్న చివుకు
దేవూడివస్త్రాలు గుళ్ళోన చివుకు
రావిచెట్టు చెక్క రంపాన చివుకు
రంభచక్కాదనము దుఃఖాన్న చివుకు.

14)
నా చేతిరోకళ్లు నల్లరోకళ్లు
నే పాడిన అన్నల్లు రామలక్ష్మణులు
రామలక్ష్మణులాల్ల రక్షపతులాల్ల
మీ రెక్కు గుఱ్ఱాలు నీలమేఘాలు
మీచేతికత్తుల్లు చంద్రాయుధాలు

15)
ఎవ్వరే చుట్టాలు యెవరుపక్కాలు
ఎవ్వరే మాపాల కలిగివున్నారు
మాపాల శ్రీవెంకటప్ప వుండగను
మనసులో చింతేల మరిభయము లేల.

16)
సింహాద్రి అప్పన్న గుళ్లముందార
పడ్డారె గొడ్లాళ్లు ప్రాణచారమ్ము
ఎందూకు పడ్డారు యేల పడ్డారు
సంతాన మియ్యమని చాల పడ్డారు - సంతాన
బిడ్డల నియ్యమని ప్రియము పడ్డారు - బిడ్డల
కొమాళ్ల నియ్యమని కోరి పడ్డారు - కొమాళ్ల
సింహాద్రి అప్పన్నకు యేమి లంచమ్ము
గుడిదిరుగు వస్త్రము గుమ్మాడిపండు
దాగళ్ల వడపప్పు చండుబెల్లాలు.

No comments:

Post a Comment