Thursday, May 28, 2020

వేమన శతకము 1 to 10

వేమన శతకము 
1
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ |

వైరాగ్యంతో ఆత్మానందం పొందే ఓ వేమనా! నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెం పుణ్యకార్యం చేసినను అది చాలా ఘనమైన ఫలాలని ఇస్తుంది. ఎలాగంటే చాలా చిన్నదైన మఱ్ఱి విత్తనం నుండి మహా వృక్షం పుట్టినట్టు.


2
ఆత్మశుద్ధి  లేని యాచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?

విశ్వదాభిరామ వినురవేమ.

పెద్దలనుండి వచ్చిన ఆచారమును అంతఃకరణ శుద్ధితో పాటించాలి. ఆత్మశుద్ధిలేని ఆచారము వ్యర్థం. వంటచేసే పాత్రలను ముందు శుభ్రపరచుకోవాలి. లేకపోతే ఆ వంట తినటానికి పనికిరాదు. అలాగే స్నానాదులతో బాహ్యశుద్ధి కలిగి ఉండటమే కాకుండా మనసును కూడా కామక్రోధాదులు లేకుండా ప్రశాంతంగా ఉంచుకొని శివపూజ చేయాలి. మనసున మాలిన్యము ఉంచుకొని పైకి ఆడంబరముగా శివపూజ చేసినా ఫలితం ఉండదు.       

3
గంగిగోవు పాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ. 

మేలైన ఆవుపాలు గరిటడైన అవి పిల్లలకి ఆరోగ్యం. గాడిదపాలు కుండడు ఉన్నా వాటికి ఈ గుణాలు ఉండవు కాబట్టి పనికిరావు. అలాగే భక్తితో ఆదరముతో పెట్టిన అన్నం తిన్నవారికి తృప్తిని ఇస్తుంది. ఇష్టం లేకుండా బండెడు అన్నం పెట్టినా అది అసహ్యమే వేస్తుంది.    
  

4
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు 
తళుకు బెళుకు రాలు తట్టెడేల 
చాటు పద్యమిలను జాలదా యొక్కటి 
విశ్వదాభిరామ వినుర వేమ!

మంచి జాతి కలిగిన ఇంద్రనీలమణి ఒక్కటి ఉంటే చాలు మెరిసే రాళ్ళు తట్టెడున్నా దాని విలువకి సరిపోదు సందర్భానుకి తగ్గట్టుగా అందమైన ఒక చాటు పద్యం లక్షల విలువ చేస్తుంది. అంతేగానీ వట్టి చప్పని పనికిరాని పద్యాలు వంద ఉన్నా ఏమి లాభం.    

5
మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి జూడ లోన జురుకుమనును 
సజ్జనులగువారు సారమిట్లుండు

విశ్వదాభిరామ వినురవేమ 

మిరియపు గింజ పైకి నల్లగా అందం లేకుండా ఉంటుంది. కానీ కొరికి చూస్తే కారం చురుక్కుమంటుంది. అదేవిధంగా సజ్జనులైనవాళ్ళు పైకి చాలా సామాన్యంగా కనబడతారు. కానీ వాళ్ళని కదిపితే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. మిరపగింజ ఆరోగ్యాన్నిచ్చినట్టు సజ్జనుడు చెప్పే మాటలు ఇహపరానికి సాధనములుగా ఉంటాయి.   
  
6
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికి దాని సువాసన చాలా దూరం వ్యాపిస్తుంది అలాగే గురువులైన వారు బయటికి నిరాడంబరముగ కనపడతారు, కానీ వారిలో  గొప్ప గుణములు ఉంటాయి.



7
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ!

భావం: 
మేడి పండు పైకి అందముగా కనపడుతుంది. దానిలోపల కనుక చూస్తే  పురుగులుంటాయి. పనికివచ్చే పదార్థం ఏమీ ఉండదు. అదే విధముగ పిరికివాడు కూడా పైకి మంచి పుష్టిగా కనబడతాడు కానీ అవసరానికి ఎదిరించి ధైర్యంగా నిలబడలేడు.  

  
8
నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తనకు ఏమీ రాదు అని చెప్పుకొని తప్పించుకుని తిరిగే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చునని  చెప్పుకునేవాడు ప్రజలలో గౌరవాన్ని పొందలేక నిందలపాలు అవుతాడు. మౌనముగానున్నవాడే బుద్ధిమంతుడు, ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.




9
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొప్పదైన గంగానది ఎప్పుడూ కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. అదేవిధంగా పెద్దవారు అనుభవం ఉన్నవారు ఆవేశాలకు లోను కాకుండా హుందాగా ఉంటారు, అల్పులైనవారు ఆవేశంతో అరుస్తూ దుడుకుగా ప్రవర్తిస్తారు.  

 

10

నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 10
 

నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి  ప్రవహిస్తాయి  చిన్న సెలయేరులు పైకి పొంగి ఉధృతంగా వేగముగ ప్రవహిస్తాయి  అదేవిధంగా జ్ఞానులైన పెద్దవారు వివేకంతో ప్రశాంతంగా మాట్లాడుతారు. అల్పులైనవారు ఆవేశంతో మాట్లాడి కార్యాలు చెడగొడతారు.   



No comments:

Post a Comment