Wednesday, September 25, 2013

అదిగో నండీ మాబడి

అదిగో నండీ మాబడి నేర్పును మాకు చక్కని నడవడి శ్రద్ధగ చదువులు చదివెదమండి చక్కగ కలిసి ఉంటామండి పాఠాలెన్నో చదివామండీ పంచ తంత్రం విన్నామండీ అందులో నీతి తెలిసిందండీ ఎప్పుడు తప్పులు చేయంలేండి! చక్కగ బుద్ధిగా ఉంటామండీ మంచి పనులు చేస్తామండీ కలసి అందరం ఉంటామండీ ఆనందంగా జీవిస్తామండీ తగువులుఎప్పుడు పడమండి కలసి కట్టుగా ఉంటామండీ కలసి మెలిసి పని చేస్తామండీ కంచు కోట నిర్మిస్తామండీ కోటకు జెండా కడుతామండీ ఆకాశాన ఎగరేస్తామండీ ఆ ఎగరే జెండా మాదే నండీ అది మా భారత జెండా సుమండీ!







లాలి పాట - లాలి లాలమ్మ లాలి లాలమ్మ

లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి ఉగ్గెట్టు మీయమ్మ ఊరికెళ్ళింది పాలిచ్చు మీ యమ్మ పట్నమెళ్ళింది నీరోసె మీయమ్మ నీళ్ళకెళ్ళింది లాలి లాలమ్మ లాలి లాలమ్మ





దాగుడుమూతా దండాకోర్

వచ్చే వచ్చే దొంగా వచ్చే - దొరికేవాళ్ళను పట్టా వచ్చే దాగండమ్మా దాగండీ - దాగుడు మూతా ఆడండీ కళ్ళకు చేతులు తీసేశా - ఇదిగో దొంగను వదిలేశా దొంగకు అందక రారండీ - తల్లిని వచ్చీ తాకండి
దాగుడుమూతా దండాకోర్ - పిల్లీ వచ్చే ఎలుకా భద్రం





సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసింది

చెట్టు కదలకుండా కొమ్మ వంచండికొమ్మ విరగకుండా పూలుకోయండి

అందులో పూలన్నీ దండ గుచ్చండిదండ తీసుకెళ్ళి సీతమ్మకివ్వండి

దాచుకో సీతమ్మ రాముడంపేడుదొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ దాచుకోకుంటేను దోచుకుంటారు.





నరనారాయణ ఋషులు

నరనారాయణ ఋషులు 

నారాయణణుడు (ఋషి) సాక్షాత్ పరమాత్మే, నరుడు (ఋషి) ఆయన అంశావతారమే. అష్టాక్షరీ మంత్రం ---- ముందుగా ఓంకారాన్ని ఉచ్ఛరించి, తరవాత నమః , నారాయణాయ అనే రెండు పదాలు చెప్పే అత్యద్భుతమైన మంత్రం. సకల ప్రయోజనాలని సాధించగలిగేది. "మంత్రరాజం" అనే బిరుదు గలది. ఆ మంత్రాన్ని లోకానికి తెలియపరచినది నారాయణుడే. 

బదరికాశ్రమంలో నారాయణుడు -- నరునికి ఉపదేశించారు. అక్కడ నుండి పరంపరగా ఈ నాటికీ అందరికీ అందుతూ వస్తోంది ఆ మంత్రం. లోకంలో గురుశిష్య సంబంధం ఎలా ఉండాలో నేర్పింది కూడా ఈ నరనారయణులే. 

చతుర్ముఖబ్రహ్మ కుడి బొటనవ్రేలి నుండి ధర్ముడు, అనే అతను జన్మించాడు. దక్షుడి కుమార్తెలలో ఒకరైన మూర్తి అనే ఆమెను వివాహమాడెను. వారిరువురికీ కలిగిన సంతానమే నరనారాయణులు (ఋషులు). వీరు కవలలు. వీరు కృతయుగంలో అవతరించారు. 

తమ పరాక్రమంతో దంబోద్భవుడు అనే రాక్షసుని గర్వం అణచి, సహస్రకవచుడు అనే రాక్షసుని 999 కవచాలు భేదించి, చివరికి మిగిలిన ఒక కవచంతో కర్ణునిగా పుడితే, తాము కూడా కృష్ణార్జునులుగా అవతరించి, కర్ణుని సంహరించారు. అప్సరసల సౌందర్యగర్వం తొలగించుటకు ఊర్వశిని సృష్టించారు. 

అష్టాక్షరీ మంత్రశక్తి ఎంతగా ప్రసరిస్తే, మనందరికీ  అంత మంచిది. మానవులమైన మనం అల్ప శక్తులం కాబట్టి, మనం మంత్రాన్ని ఎక్కువగా జపించలేము అని, నరనారాయణులు ఇప్పటికీ పర్వత రూపాలలో ఉండి, అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. 

బద్రీనాథ్ వెళ్ళేవారంతా ఆలయంలోని నారనారాయణ విగ్రహమూర్తులనే దర్శించటం కాక, పర్వత రూపాలలో ఉన్న వారిని కూడా దర్శించుకొని, కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి, వారి సంస్కారాన్ని తెలియపరుస్తారు. 


                               

మన ఋషులు

మన ఋషులు:--

శ్రీ శ్రీ శ్రీ శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారు బాలల కోసం రచించిన మన ఋషులు అనే పుస్తకం నుండి సంగ్రహించి రాస్తున్న ఋషుల చరిత్రలు.....

ఆదర్శ ఋషులు --- నరనారాయణులు 

ఋషి అంటే ఎలా ఉండాలి ? ఏం చెయ్యాలి ? ఎలాంటి ప్రయోజనంతో ఉండాలి ? తపస్సు అంటే ఏమిటి ? మంత్రజపం చేయాలా ! చేస్తే ఎలా చేయాలి ? ఏ మంత్రాన్ని చెయ్యాలి ? ఆ మంత్రం ఎలా ఉపదేశం పొందాలి ?ఉపదేసించే గురువు ఎలా ఉండాలి ?

ఉపదేశం పొందే శిష్యుడు ఎలా ఉండాలి ?

పై విషయాలు అన్నీ తెలియాలిగా మరి ! శాస్త్రాల్లో ఉన్నా ఆచరణలో పెట్టి చూపిస్తేనే మానవులకి అందుబాటులో ఉంటుంది. అందుచేత పరమాత్మే స్వయంగా ఇద్దరు ఋషులుగా అవతరించాడు. ఆ ఇద్దరే నరుడు -- నారాయణులుగా ప్రసిద్ధిని పొందేరు. 

నరుడు -- నారాయణుడు అని రెండు పేర్లు అన్నమాట. మనదేశంలోనే వీరిరువురూ అవతరించటం మన భాగ్యంగా భావించాలి. ఉత్తరాంచల్ రాష్ట్రంలో , చమేలీజిల్లాలో , బద్రీనాథ్ అనే ఊరు ఉన్నది. ఆరునెలలపాటు సమీపించటానికి కూడా సాధ్యం కాకుండా ఉండే ఒక అద్భుతమైన పవిత్ర పుణ్యక్షేత్రమే బద్రీనాథ్. 

అదే నరనారాయణుల అవతారపుణ్యస్థలం. విగ్రహ రూపంలోనే కాకుండా, పర్వత రూపంలో కూడా ఇప్పటికీ మనకి దర్శనమిస్తూనే ఉంటారు....ఆ ఆదర్శ ఋషులు.



Friday, September 13, 2013

పొద్దున్నే పొద్దున్నే లేద్దామా

పొద్దున్నే పొద్దున్నే లేద్దామా 

పొద్దున్నే పొద్దున్నే లేద్దామా
తోటలోని పూలన్ని కోద్దామా

కోసినవి రాశులుగా పోద్దామా
పోసినవి మాలలుగా అల్లేద్దామా

పొద్దున్నే పొద్దున్నే లేద్దామా
తోటలోని పూలను కోద్దామా

అల్లినవి గుళ్ళోకిచ్చివేద్దామా
దేవునికి మాలలుగా వేద్దామా......

ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి

ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి 

ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి
రెండు రెండు రెండు మంచి చెడులు రెండు
మూడు మూడు మూడు జెండా రంగులు మూడు
నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకు నాలుగు
ఐదు ఐదు ఐదు చేతికి వేళ్ళు ఐదు
ఆరు ఆరు ఆరు ఋతువులు మనకు ఆరు
ఏడు ఏడు ఏడు వారంరోజులు ఏడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మనకు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాలు మనకు తొమ్మిది



ఉగాది పండుగ వచ్చింది.

ఉగాది పండుగ వచ్చింది. 

ఉగాది పండుగ వచ్చింది.
ఊరికి అందం తెచ్చింది.
ఉత్సవాలతో దేవుళ్ళకు ఊరేగింపులు సాగాయి.

ఉగాది పండుగ వచ్చింది.
ఊరికి అందం తెచ్చింది.
పంచాంగాలను చదివించి మంచి చెడ్డలు విన్నాము.






Thursday, September 12, 2013

చందమామ రావే

చందమామ రావే

చందమామ రావే,జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటి పూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు
తేవే తేరు మీద రావే తేనెపట్టు తేవే
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే
పరుగెత్తి రావే పనసపండు తేవే
నామాట వినవే నట్టింట పెట్టవే
అన్నింటిని తేవే మా అబ్బాయికి ఇవ్వవే....


పాపల్లారా రారండి చక్కటి రంగు చూడండి

పాపల్లారా రారండి చక్కటి రంగు చూడండి

పాపల్లారా రారండి చక్కటి రంగు చూడండి
గులాబి పువ్వును నేనండి ఎరుపు రంగు నాదండి
సంపంగి పువ్వును నేనండి పచ్చ రంగు నాదండి
మల్లి పువ్వు నేనండి తెలుపు రంగు నాదండి
ఆకాశమంతా నేనండి నీలంరంగు నాదండి.




బుజ బుజ రేకుల పిల్లుందా

బుజ బుజ రేకుల పిల్లుందా 

బుజ బుజ రేకుల పిల్లుందా
బుజ్జారేకుల పిల్లుందా
స్వామి దండల పిల్లుందా
స్వరాజ్యమిచ్చే పిల్లుందా
బుజ బుజ రేకుల పిల్లుందా
బుజ్జారేకుల పిల్లుందా




నేనొక అందాల డాక్టర్ని

నేనొక అందాల డాక్టర్ని 

నేనొక అందాల డాక్టర్ని
నాకొక చిట్టి పొట్టి బ్యాగుంది
బ్యాగులో ఎన్నో మందులున్నాయి
టాబ్లెట్ ప్లస్ టానిక్ లిస్తా
ఇసిజి ఇంజెక్షన్ ఇచ్చేస్తా
గుండె తీసి గుండెను పెట్టేస్తా
రోగాలన్ని తగ్గిస్తా.








కాకి ఒకటి నీళ్ళకు

కాకి ఒకటి నీళ్ళకు 

కాకి ఒకటి నీళ్ళకై కావ్ కావ్ అని అరిచెను
అడవి అంత తిరుగుచూ అలసి సొలసి పోయెను
చిన్న మూతి కూజా ఒకటి కంటపడెను
అడుగునున్న నీరు కన్నులారా చూచెను
గులకరాళ్ళు తెచ్చెను
ఒకటి ఒకటి వేసెను
నీరు పైకి రాగనే కోరినంత తాగెను
హోప్ అని ఎగిరెను





ఆడుకుందాం

ఆడుకుందాం 

ఆడుదాం పాడుదాం అల్లరెంతో చేద్దాం
గెంతుదాం దూకుదాం గమ్మత్తెంతో చేసేద్దాం
కుంటుదాం కూలుదాం గుంజీలు తీయుద్దాం
పరుగెడదాం పట్టుకుందాం గుంజికాయ గుంజుదాం