Wednesday, October 9, 2013

దసరా బొమ్మలకొలువు

బొమ్మలకొలువు 

దసరా పండుగకి 3 రోజుల  ముందుగా ,  ప్రతీ ఇంట్లోను ఇలాగ బొమ్మలకొలువును అలంకరించి, 3 రోజులు, అనగా సరస్వతీ పూజ చేసి, మూల నక్షత్రం నుండి దసరా వరకు ఉంచి,  పిల్ల - పెద్ద అందరినీ పేరంటం పిలిచి,   పప్పుబెల్లాలు , మరమరాలు(మూరీలు), వంటివి పంచిపెడతారు.
  





దసరా పద్యం

దసరా పద్యం 

అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.


ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి,
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగానుమ్,
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి,
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి,
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు. 
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక,
రేపురా మాపురా మళ్ళి రమ్మనక,
చేతిలో లేదనక, ఇవ్వలేమనక,
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక,
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ,
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!

జయీభవా విజయీ భవా

రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా . ..... 

Tuesday, October 8, 2013

మన పండుగలు

మన పండుగలు


సంక్రాంతి పండుగ వచ్చింది సరదా లెన్నో తెచ్చింది కొత్త బట్టల్ని కట్టాము బహుమతులెన్నో పొందాము.





ఉగాది పండుగ వచ్చింది జగాన వెలుగు నిండింది చేదు,వగరు,తీపి గుర్తులతో జీవితమంతా సాగింది.  






దసరా పండుగ వచ్చినది దర్జా లెన్నో తెచ్చినవి దండిగ డబ్బుల్లు వచ్చినవి కోరికలన్నీ తీరినవి.  




 
దీపావళి పందుగ వచ్చినది దివిటీలెన్నో వెలిగించింది చీకటినంతా ప్రారద్రోలింది చిరంజీవిగా నిలచింది. 

దశావతారం

దశావతారం 


మా పాపమామల్లు -- మత్స్యావతారం కూర్చున్న తాతల్లు -- కూర్మావతారం వరసైన బావల్లు -- వరాహావతారం నట్టింట నాయత్త -- నరసింహావతారం వాసిగల బొట్టెల్లు -- వామనావతారం పరమగురుదేవ -- పరశురామావతారం రక్షించు రామయ్య -- రామావతారం బంటైన బంధువులు -- బలభద్రావతారం బుద్ధితో మా చిట్టి -- బుద్ధావతారం కలివిడితో మా యన్న -- కలికావతారం వర్ధిల్లు పసిపాప -- వర్దిల్లు నా తండ్రి చిట్టి నా కన్నోడు -- శ్రీ కృష్ణావతారం



లాలిపాట

లాలిపాట 


లాలి లాలమ్మ -- లాలి లాలమ్మ లాలమ్మ గుర్రాలు -- లంకల్లో మేసె బుల్లెమ్మ గుర్రాలు -- బీడుల్లో మేసె అప్పన్న గుర్రాలు -- అడవుల్లో మేసె ఊరుకో అబ్బాయి -- వెర్రి అబ్బాయి ఉగ్గెట్టు మీయమ్మ -- ఊరుకెళ్ళింది పాలిచ్చు మీయమ్మ -- పట్నమెళ్ళింది
నీళ్ళోసె మీయమ్మ -- నీళ్ళకెళ్ళింది లాలి లాలమ్మ -- లాలి లాలమ్మ


వీడేనమ్మ కృష్ణమ్మ

వీడేనమ్మ కృష్ణమ్మ

వీడేనమ్మ కృష్ణమ్మ -- వేణువునూదే కృష్ణమ్మ ఆవులు కాసే కృష్ణమ్మ -- వీడే ముద్దుల కృష్ణమ్మ కాళ్ళకు గజ్జెలు చూడండి -- మొలలో గంటలు చూడండి మెడలో దండలు చూడండి -- తలలో పింఛం చూడండి చదువులనిచ్చే కృష్ణమ్మ -- సంపదలనిచ్చే కృష్ణమ్మ పాపాలుకాచే కృష్ణమ్మ -- బాలబంధువీ కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ -- వేణువునూదే కృష్ణమ్మ