Thursday, September 12, 2013

జానీ జానీ జగ్గయ్య

జానీ జానీ జగ్గయ్య

జానీ జానీ జగ్గయ్య
మంచం కింద మామయ్య
చుట్టాలొచ్చారు లేవయ్యా
సినిమాకెళ్దాం రావయ్యా
డబ్బులు లేవు గిబ్బులు లేవు
పోవయ్యా పుల్లయ్యా





మామా మామా మామిడిపండు

మామా మామా మామిడిపండు 


మామా మామా మామిడిపండు 
మామ నెత్తి బోడిగుండు
అల్లం,బెల్లం తెచ్చిండు అందరికి ఇచ్చిండు
పెద్ద గుండు ఎత్తిండు
ఎత్తలేక ముక్కిండు
కాలు జారి పడిండు
కర్ర చేత పట్టిండు.




ఆకు కావాలా పువ్వు కావాలా

ఆకు కావాలా పువ్వు కావాలా 

ఆకు కావాలా పువ్వు కావాలా
పువ్వు కావాలి

పువ్వు కావాలా పండు కావాలా
పండు కావాలి

పండు కావాలా లడ్డు కావాలా
లడ్డు కావాలి

లడ్డు కావాలా అమ్మ కావాలా
అమ్మ కావాలి.



అ ఆ లు దిద్దుదాం

అ ఆ లు దిద్దుదాం 

అ ఆ లు దిద్దుదాం అమ్మ మాట విందాం 
ఇ ఈలు చదువుదాం ఈశ్వరుణ్ని కొలుద్దాం 
ఉ ఊలు దిద్దుదాం ఉడతలను చూద్దాం 
ఎ ఏ ఐ అంటూ అందరినీ పిలుద్దాం 
ఒ ఓ ఔ అంటూ ఓనమాలు దిద్దుదాం 
అం అః అంటూ అందరమూ పాడుదాం....  

గురువు గారు చెప్పిన పాఠాలు చదువుదాం 
మామ్మ గారు చెప్పిన మంచి పనులు చేద్దాం 
తాత గారు చెప్పిన నీతి కథలు విందాం 
అందరం కలుద్దాం ఆనందంగా ఉందాం..... 



Wednesday, September 11, 2013

చిట్టిపాప


   చిట్టిపాప   


చిన్ని మాఅమ్మాయికి శ్రీ ముఖము చూసి 
సిగ్గుపడి జాబిల్లి మబ్బుచాటుకు పోయే 

పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటేను 
పనసపండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలోగ్గేరు

నీలాలు కెంపులు నిలుపు వజ్రాలు
పగడాలు రత్నాలు పారిజాతాలు

పడతి మాఅమ్మాయి పనిచేయుచోట
చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు
అందరికి మాపాప అల్లారుముద్దు




గుండుసున్న

గుండుసున్న 

వానవచ్చి వాగులు పారె --- కోడివచ్చి గుడ్డుపెట్టె 

తాతవచ్చి తొంగిచూసే --- అవ్వవచ్చి గుడ్డు తీసే 

అమ్మవచ్చి అట్టువేసే ---- అట్టుచూసి గుటకలు వేశా

అన్నవచ్చి గుటుక్కున మింగే

నాకు మాత్రం గుండుసున్న 






జంతువుల అరుపులు

జంతువుల అరుపులు 

చెట్టు మీద కాకి ---- కావ్ కావ్

గోడమీద పిల్లి ----- మ్యావ్ మ్యావ్ 

మందలో గొర్రెపిల్ల ---- బే బే

తల్లినిచూసి మేకపిల్ల ---- మే మే

దొంగనుచూసి కుక్కపిల్ల ----- భౌ భౌ

ఇల్లెక్కిన కోడి --- కొక్కొరోకో






ఓ బొజ్జ గణపయ్య

ఓ బొజ్జ గణపయ్య 

ఓ బొజ్జ గణపయ్య --- నీ బంటు నేనయ్య 
కమ్మని పెరుగయ్య --- కందిపప్పయ్య 
పేరిన నెయ్యయ్య --- పెసరపప్పయ్య 
పార్వతి పరమేశ్వరుల ----తనయుడనీవయ్య 
ఎలుక వాహనం మీద ----- ఎక్కి రావయ్య 
ఉండ్రాళ్ళ మీదకు ---- దండు పంపయ్య




Tuesday, September 3, 2013

వానల్లు కురవాలి

వానల్లు కురవాలి

వానల్లు కురవాలి -- వానదేవుడా
వరిచేలు పండాలి --  వానదేవుడా
నల్లని మేఘాలు --  వానదేవుడా
చల్లగా కురవాలి --  వానదేవుడా

మాఊరి చెరువంతా --  వానదేవుడా
ముంచెత్తి పోవాలి --  వానదేవుడా
కప్పలకు పెండ్లిండ్లు --  వానదేవుడా
గొప్పగా చేస్తాము --  వానదేవుడా

పచ్చగా చేలంత --  వానదేవుడా
పంటల్లు పండాలి --  వానదేవుడా
వానల్లు కురవాలి -- వానదేవుడా
వరిచేలు పండాలి --  వానదేవుడా


Friday, August 30, 2013

ఏనుగు

ఏనుగు 

ఏనుగమ్మ ఏనుగు -- నాలుగుకాళ్ళ ఏనుగు 

ఏ ఊరొచ్చింది ఏనుగు ? -- మా ఊరొచ్చింది ఏనుగు 

ఏం చేసింది ఏనుగు ? -- మంచినీళ్ళు తాగింది ఏనుగు

ఏనుగు ఏనుగు నల్లన -- ఏనుగు కొమ్ములు తెల్లన

ఏనుగు మీద రాముడు -- ఎంతో చక్కని దేముడు




పిల్లి

పిల్లి

అల్లరిచేస్తే పిల్లొస్తుంది
ముక్కూ చెవులూ రక్కేస్తుంది
అల్లరిమానీ పిల్లల్లారా
చల్లగ మెల్లగ కూర్చోండర్రా
(పిల్లలు మారాంచేస్తే మానిపించటానికి ఇలాంటి పాటలే మాటలే చెబుతారు అమ్మలు)




చిలుక పలుకులు

చిలుక పలుకులు 

చిట్టి చిలకమ్మా -- పలుకు పలుకమ్మా 

ఆ గువ్వను చూడమ్మా -- గూడు కట్టమ్మా 

కోడీ పెట్టమ్మా -- గుడ్డూ పెట్టమ్మా 


పావురాయమ్మా -- పాపకీయమ్మా 

పాప చేతిలో ఉందమ్మా -- పంచదార చిలుకమ్మా






నా కాళ్ళ గజ్జెలు:--

నా కాళ్ళ గజ్జెలు:-- 

నా కాళ్ళ గజ్జెలు -- మోకాళ్ళ చిప్పలు

అబ్బబ్బ నడుము -- అద్దాల రవికె 

ముత్యాలహారం -- కస్తూరితిలకం

బిందె మీద బిందె -- బిందెలోన పెరుగు

పెరుగమ్మ పెరుగు -- తిరుగమ్మ తిరుగు




ఒప్పులుకుప్పా

ఒప్పులుకుప్పా

ఒప్పులకుప్పా -- వయారి భామా
సన్నా బియ్యం -- ఛాయ పప్పు
బావిలో కప్పా -- చేతిలో చిప్పా
రోట్లో తవుడు -- నీ మొగుడెవరు ???
గూట్లో రూపాయ్ -- నీ మొగుడు సిపాయ్.....

(ఆడపిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునే ఆటలలో ఇది ఒక ఆట. శివరాత్రి పండుగ వచ్చిన...... అట్లతద్ది వచ్చిన చేతికి గోరింటాకు పెట్టుకొని...... ఉయ్యాలలు ఊగుతూ...... చెమ్మచెక్క ఆటలు ఆడుతుంటారు..... కానీ ఈ రోజులలో ఆ ముచ్చట్లేమీ అస్సలు లేనే లేవు కదా)


మ్యావ్ మ్యావ్ పిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి 

మ్యావ్ మ్యావ్ పిల్లి -- పాలకోసం వెళ్ళి 
వంటగదికి మళ్ళి -- తలుపు చాటుకెళ్ళీ 
మూతతీసి తాగ -- మూతి కాలె బాగా 
అమ్మవచ్చి చూచె -- నడ్డి విరగగొట్టె 


(పిల్లి ఎప్పుడూ దొంగతనంగా వంటింటిలోకి దూరిపోయి.... పాలు తగేస్తూ ఉంటుంది. అలా దొంగతనంగా పాలు తాగటం దాని సహజ గుణం. దాని కాళ్ళు , నడ్డి విరగగొట్టటం మన సహజ లక్షణం. కానీ ఈ రోజుల్లో పిల్లులకి అందకుండా పాలు-- పెరుగులు ఫ్రిజ్ లలోనే ఉంటున్నాయి.)