Friday, May 22, 2015

రావి రంగారావుగారు రాసిన బాలల గేయాలు

రావి రంగారావుగారు రాసిన బాలల గేయాలు 

1) చలి గాలి పాట

చలి గాలీ, చలి గాలీ,
కొరికేయొద్దే...
నీ కంతటి కోర పళ్ళు 
ఎక్కడివే!
చలి గాలీ, చలి గాలీ,
నమిలేయొద్దే,
నీ కంతటి పెద్ద నోరు
ఎక్కడిదే!
చలి గాలీ, చలి గాలీ,
వణికించొద్దే...
నీ కంతటి పులి రూపం
ఎక్కడిదే!
చలి గాలీ, చలి గాలీ,
కాల్చేయొద్దే...
నీ కంతటి పెద్ద నిప్పు
ఎక్కడిదే!
ఏమీ లేకుండానే
బలే ఆదరగొడుతున్నావ్...
స్వెట్ట రేసుకున్నా, నువు
జడిసి పారిపోవాలే!

2) అనగనగా ఒక చీమ

అనగనగా ఒక చీమ, సముద్రాన్ని చూడాలనుకొంది
కప్పులోన సముద్రాన్ని చూసింది,
దాన్ని మించి మరి ఏదీ లేదంది!
పళ్ళెంలో సముద్రాన్ని చూసింది,
దాన్ని మించి మరి ఏదీ లేదంది!
కాలవలో సముద్రాన్ని చూసింది,
దాన్ని మించి మరి ఏదీ లేదంది!
ఒక రోజున సముద్రాన్ని చూపిస్తే,
ఇది సముద్రమే కాదని పొమ్మంది!

3) ఎన్ని కోరికలో 

ఎన్ని కోరికలో 
నా మనసు నిండా,
అమ్మకు చెప్పాలి 
నాన్నకు చెప్పాలి...
అందాల చంద్రుణ్ణి
అందుకోవాలి 
వెలిగేటి చుక్కల్ని
చూసి రావాలి
ముసిరేటి మబ్బుల్ని 
పలకరించాలి 
ఉదయించు సూర్యుడికి 
ముద్దు పెట్టాలి...
తిరిగేటి పక్షులకు 
తిండి పెట్టాలి 
ఎగిరే విమానాన్ని 
ఎక్కి తీరాలి
నీలి ఆకాశాన్ని 
చుట్టి రావాలి 
అక్కడే ఎన్నేన్నొ
ఆట లాడాలి...
ఆట లన్నీ ఆడి
అమ్మ ఒడి దూరాలి
ఊసు లన్నీ నాన్న 
చెవిలోన పోయాలి

4) జోల పాట

జో జో జో... జో జో జో...
నిదురపో, నిదురపో...
చెట్టు నిదర పోతున్నది 
పువ్వు నిదర పోతున్నది 
పిట్ట నిదర పోతున్నది 
గూడు నిదర పోతున్నది
చుక్క నిదర పోతున్నది 
మబ్బు నిదర పోతున్నది 
గాలి నిదర పోతున్నది 
మబ్బు నిదర పోతున్నది
కుక్క నిదర పోతున్నది 
పిల్లి నిదర పోతున్నది 
ఆవు నిదర పోతున్నది 
దూడ నిదర పోతున్నది
తోట నిదర పోతున్నది 
పార్కు నిదర పోతున్నది 
ఆట నిదర పోతున్నది 
పాట నిదర పోతున్నది...

5) ఉద్యోగం చేస్తున్నా...

నాన్నేం చేస్తాడు
ఉద్యోగం చేస్తాడు
నాన్నేం తెస్తాడు 
డబ్బు తెస్తాడు...
అమ్మేం చేస్తుంది
ఉద్యోగం చేస్తుంది
అమ్మేం తెస్తుంది
డబ్బు తెస్తుంది
నువ్వేం చేస్తున్నావ్ కొండా!
ఉద్యోగం చేస్తున్నా,
ఏ ఉద్యోగం చేస్తున్నావ్!
తినిపెట్టే ఉద్యోగం చేస్తున్నా...

6) రాజును నేనే...

సింహం బెబ్బులి పోరాటం 
అడవి జీవులకు ఆరాటం .
రాజును నేనే నంటూ...
రాజును నేనే నంటూ...
జింకలు వచ్చీ చెప్పాయి 
చీలిక మీకూ వద్దంటూ...
కోతులు వచ్చీ చెప్పాయి 
కోపా లేవీ వద్దంటూ...
అడవి పందులూ చెప్పాయి 
గొడవలు మీకూ వద్దంటూ...
ఖడ్గ మృగాలూ చెప్పాయి 
కలహా లేవీ వద్దంటూ...
ఎలుగుబంటులూ చెప్పాయి 
కలతలు మీకూ వద్దంటూ...
ఏనుగు లొచ్చీ చెప్పాయి
భేదా లేవీ వద్దంటూ...
పక్షులు వచ్చీ చెప్పాయి 
గొడవలు మీకూ వద్దంటూ...
రంగు నెమళ్ళు చెప్పాయి 
రభసా లేవీ వద్దంటూ...
ఎవరు వచ్చినా ఏమి చేసినా 
సింహం బెబ్బులి వినలేదు,
అడవి ప్రాణులు ఒకటై తంతే
అడవిని వదిలి పోయారు.

7) ఎవరితో ఆడుకుంటావు!

ఎవరితో ఆడుకుంటావు,
కుక్కతో ఆడుకుంటావా!
దాని 
తోక లాగకూడదు...
ఎవరితో ఆడుకుంటావు,
పిల్లితో ఆడుకుంటావా!
దాని 
మీసం పీకకూడదు...
ఎవరితో ఆడుకుంటావు,
బొమ్మతో ఆడుకుంటావా!
దాన్ని 
విరగగొట్టకూడదు...
ఎవరితో ఆడుకుంటావు,
నాన్నతో ఆడుకుంటావా!
నాన్న 
చెవులు కొరకకూడదు...
ఎవరితో ఆడుకుంటావు,
మామతో ఆడుకుంటావా!
అట్లయితే 
నీ ఇష్టం! మామిష్టం!

8) డాం...డాం...డాం...

పాలన్నం తినమంటూ 
పళ్ళెం ఇచ్చింది అమ్మ,
నా చేతుల్లో పళ్ళెం 
డాం...డాం...డాం...
అక్షరాలు రాయాలని 
పల కిచ్చాడు నాన్న,
నా చేతుల్లో పలక 
డాం...డాం...డాం...
ముఖం చూసుకోవాలని 
అద్దం తెమ్మంది అక్క,
నా చేతుల్లో అద్దం 
డాం...డాం...డాం...
మంచి నీళ్ళు కావాలని 
తెమ్మన్నా డన్న,
నా చేతుల్లో గ్లాసు 
డాం...డాం...డాం...
అందరు నా కాడుకునే 
బొమ్మలు తెచ్చివ్వండి,
నా బొమ్మలు తాకారా...
మీ రంతా డాం...డాం...డాం...

9) గుండు నున్నగా గీశారు

హైదరబాదు వెళ్ళాము,
హుసేనుసాగరు చూసాము...
విశాఖపట్నం వెళ్ళాము,
బీచీ, పోర్టు చూసాము...
రాజమండ్రికి వెళ్ళాము,
గోదావరిని చూసాము...
విజయవాడకు వెళ్ళాము,
కృష్ణానదిని చూసాము...
నెల్లూరుకు వెళ్ళాము,
పెన్నానదిని చూసాము...
ఏడు కొండలు ఎక్కాము,
గుండు నున్నగా గీశారు.

10) విత్తునుండి మొలకొస్తే ఏం చేస్తావు!

విత్తునుండి మొలకొస్తే ఏం చేస్తావు,
పాదు చేసి నీరు పోసి బతికిస్తాను...
మొక్కలాగ పైకొస్తే ఏం చేస్తావు,
కంచె వేసి తిండి పెట్టి పెంచేస్తాను...
చక్కని పువ్వులు పూస్తే ఏం చేస్తావు,
మా అమ్మకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను,
తియ్యని కాయలు కాస్తేఏం చేస్తావు,
అమ్మా, నాన్నా, నేను తినివేస్తాము...
తినగా మిగిలిన గింజలు ఏం చేస్తావు,
పెరడులోన పాతి మరల మొలిపిస్తాను...

11) గొడుగుండాలి...

తడవకుండా గొడుగుండాలి వానొస్తుంటే, పెద్ద వానొస్తుంటే...
కాలకుండా గొడుగుండాలి ఎండొస్తుంటే, మండుటెండొస్తుంటే...
కరవకుండా  గొడుగుండాలి కుక్కొస్తుంటే, ఊరకుక్కొస్తుంటే...
పొడవటానికి  గొడుగుండాలి దొంగొస్తుంటే, దోపిడీ దొంగొస్తుంటే...

12) ఏ దెక్కుతావు!

కాకి నెక్కుతావా! - చిలక నెక్కుతావా!
కాకి నెక్కితే నలుపు,  - చిలక నెక్కుతాను

చిలక నెక్కుతావా! - గద్ద నెక్కుతావా!
చిలక నెక్కితే పడతా, - గద్ద నెక్కుతాను

గద్ద నెక్కుతావా! - ఏను గెక్కుతావా!
గద్ద నెక్కితే ఇరుకు, - ఏను గెక్కుతాను

ఏను గెక్కుతావా! - గుర్ర మెక్కుతావా!
ఏను గెక్కితే కదలదు, - గుర్ర మెక్కుతాను

గుర్ర మెక్కుతావా! - విమాన మెక్కుతావా!
గుర్ర మెక్కితే నెమ్మది, - విమాన మెక్కుతాను,
విమాన మెక్కి నేను  - విదేశాల కెళతాను.

13) ఇష్టంగా తిందాము...

చిలకమ్మా రావమ్మా 
జామ పండు తేవమ్మా
ఇద్దరమూ పంచుకొని 
ఇష్టంగా తిందాము...
ఉడతమ్మా రావమ్మా 
బాదం పప్పు తేవమ్మా 
ఇద్దరమూ పంచుకొని 
ఇష్టంగా తిందాము...
పిచుకమ్మా రావమ్మా 
జొన్న కండెలు తేవమ్మా 
ఇద్దరమూ పంచుకొని 
ఇష్టంగా తిందాము...
కోతిబావా రావయ్యా 
కొబ్బరి కాయ తేవయ్యా 
భగవంతుడికి కొడదాము
పచ్చడి చేసుకు తిందాము...

14) రాత్రి కూడా మంచి నేస్తమే...

రాత్రి కూడా 
అమ్మలాంటిదే 
చందమామను 
తెచ్చిస్తుంది...
చీకటి కూడా 
నాన్న లాంటిదే,
చుక్కల నెన్నో 
చూపిస్తుంది...
చందమామ 
వెన్నెలలోన 
అమ్మ అన్నమూ 
తినిపిస్తుంది,
చక్కని చుక్కల 
కాంతుల లోన 
నాన్న మాటలు 
నేర్పిస్తాడు...
చీకటి చూసీ
భయపడ కండీ,
సూర్యుడిలాగా
మన కందరకూ
రాతిరి కూడా 
మంచి నేస్తమే...

15) తూనీగా తూనీగా...

తూనీగా తూనీగా
అటువైపే పోవద్దు,
తుంటరి పిల్లా డొకడు 
మాటు వేసి ఉన్నాడు...
చిలకమ్మా చిలకమ్మా 
అటువైపే పోవద్దు,
పాడు వేటగా డొకడు 
పంజరాన్ని తెచ్చాడు...
పావురమా పావురమా 
అటువైపే పోవద్దు 
రక్కసి పిల్లాడొకడు 
రాయి పట్టుకున్నాడు...
అల్లరి వాళ్లగుపిస్తే 
అటువైపే పోవద్దు,
మంచివారితో స్నేహం
పెంచుకోవటం ముద్దు.

16) ఆవులు ఆవులు ఆవులు

ఆవులు ఆవులు ఆవులు 
రంగు రంగులా ఆవులు 
ఎర్రా ఎర్రని ఆవులు 
తెల్లా తెల్లని ఆవులు
చల్లని గాలులు పీలుస్తూ 
చక్కని దారులు తిరిగేస్తూ 
ఆవులు ఆవులు ఆవులు 
రంగు రంగులా ఆవులు
కొండల మీద మేసేస్తూ 
కోనల లోన నడిచేస్తూ 
ఆవులు ఆవులు ఆవులు 
రంగు రంగులా ఆవులు
లేగ దూడలకు పాలిస్తూ 
మన కందరకు పాలిస్తూ 
ఆవులు ఆవులు ఆవులు 
రంగు రంగులా ఆవులు
అమ్మల వంటివి ఆవులు 
దేవతలే మన ఆవులు 
ఆవులు ఆవులు ఆవులు 
రంగు రంగులా ఆవులు

17) చుక్కమ్మా చుక్కమ్మా

చుక్కమ్మా! చుక్కమ్మా! 
చక్కనైన చుక్కమ్మా! 
చక్కని వెలుగును కాస్తా 
తెచ్చియ్యమ్మా...
చంద్రమ్మా! చంద్రమ్మా! 
చల్లనైన చంద్రమ్మా! 
చల్లని వెన్నెల కాస్తా 
తెచ్చియ్యమ్మా...
సూరయ్యా సూరయ్యా! 
చురుకైన సూరయ్యా! 
చుర్రున నీవు రావాలి 
తుర్రున చీకటి పోవాలి.

18) కొమ్మ నుండి చిలకమ్మ...

కొమ్మ నుండి చిలకమ్మా 
ఝాం ఝామ్మని పోతున్నది 
ఆగు ఆగు అన్నాను,
ఆగను ఆగను అన్నది...
అడవిలోకి పోతున్నది 
ఆట లాడుకుంటున్నది 
పార్కు లోకి పోతున్నది 
పాట పాడుకుంటున్నది
తోట లోకి పోతున్నది 
జామ కాయ తింటున్నది 
పొలం లోకి పోతున్నది 
పండు తెచ్చుకుంటున్నది
బడిలోనికి పోతున్నది 
భలే చదువుకుంటున్నది 
బడి కెళతా నేను కూడ
బాగ చదువుకుంటాను.

19) అందమైన ఊరును చూడు...

అందమైన 
ఊరును చూడు,
ఊరికున్న
చెరువును చూడు...
చెరువులోని 
నీరును చూడు,
నీరు కున్న 
గట్టును చూడు...
గట్టుమీది 
మొక్కను చూడు,
మొక్కకున్న 
కొమ్మలు చూడు...
కొమ్మమీది 
పువ్వులు చూడు,
పువ్వుల కున్న 
రంగులు చూడు...
ఎన్ని రంగులున్నా 
అన్నీ బాగున్నాయి,
ఎందరు మనుషు లున్నా 
అందరు బాగుండాలి.

20) వద్దూ వద్దూ వద్దూ..

వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు 
ఉదయం లేవను అనవద్దు 
నిద్దుర పోతా అనవద్దు...
వద్దూ వద్దూ వద్దూ 
వద్దూ వద్దని అనవద్దు 
ముఖం కడగనని అనవద్దు 
స్నానం వద్దని అనవద్దు...
వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు 
అన్నం తిననని అనవద్దు 
పాలు తాగనని అనవద్దు..
వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు
బడికి పోనని అనవద్దు 
పాఠం వద్దని అనవద్దు...
ముద్దూ ముద్దూ ముద్దూ 
ఎవ్వరి కైనా ముద్దు 
మంచి చదువులే ముద్దు 
మంచి అలవాట్లు ముద్దు...

21) అందరికీ నేనే ముద్దులు పెడతాను

నాకో బుజ్జి 
నోరుంది 
అమ్మ ముద్దు
పెడుతుంది...
నాకో చిన్ని 
బుగ్గుంది 
నాన్న ముద్దు 
పెడతాడు
నాకో చిట్టి 
ముక్కుంది 
తాతి ముద్దు 
పెడుతుంది
నాకో చిన్న
నుదురుంది
తాత ముద్దు 
పెడతాడు...
అందరు నాకే 
ముద్దులు పెడతారు 
అందరికీ నేనే 
ముద్దులు పెడతాను...

22) కాకమ్మా కాకమ్మా...

కాకమ్మా కాకమ్మా 
మా ఇంటికి రావమ్మా 
కాఫీ కాచిస్తాను 
కమ్మగ తాగేయమ్మా...
తూనీగా తూనీగా 
మా ఇంటికి రావమ్మా 
టీ పొడి కాచిస్తాను
వేడిగ తాగేయమ్మా
పావురమా పావురమా 
మా ఇంటికి రావమ్మా 
పండ్ల రసం ఇస్తాను 
బాగా తాగేయమ్మా
కోకిలమ్మ కోకిలమ్మ 
మా ఇంటికి రావమ్మా 
కూలుడ్రింకు ఇస్తాను 
ఖుషీగ తాగేయమ్మా
మా చెట్టు మీది పక్షులార 
మా ఇంటికి రారండి 
కబురు లన్ని చెప్పుకొని 
కమ్మగ భోంచేద్దాము.

23) కుక్కూ కుక్కూ కుక్కూ...

కుక్కూ కుక్కూ కుక్కూ 
కోయిల వచ్చింది 
చెట్టు నిదుర లేచింది 
చిగురులు తొడిగింది
కుక్కూ కుక్కూ కుక్కూ 
కోయిల పలికింది 
చెట్టు నవ్వు విరిసింది 
పువ్వులు పూసింది
కుక్కూ కుక్కూ కుక్కూ 
కోయిల పాడింది 
చెట్టు సంతసించింది 
కాయలు కాసింది...
కుక్కూ కుక్కూ కుక్కూ 
కోయిల వెళ్ళింది 
వచ్చే ఏటికి మళ్ళీ 
వసంతమై వస్తుంది...

24) లాల లాల లాలలా

లాల లాల లాలలా
లాల లాల లాలలా 
నేలమీద నింగిలోన 
గాలి తిరుగుతున్నది...
రార రార రారరా
రార రార రారరా 
నదులలోన పోలాల్లోన
నీరు నడుస్తున్నది...
పాప పాప పాపపా 
పాప పాప పాపపా 
చెట్టుమీద గుట్టమీద 
పక్షి ఎగురుతున్నది...
టాట టాట టాటటా
టాట టాట టాటటా
అమ్మకు నాన్నకు టాటా 
నేను బడికి పోతున్నా...

25) రంగా రంగా రంగా

రంగా రంగా రంగా 
చెడును 
పెడుతున్నావా దూరంగా...
కాకీ కాకీ కాకీ 
స్నేహం 
వదిలేసావా ఏకాకీ...
నావా నావా నావా 
నదిలో 
వడివడిగా పోతున్నావా...
కోడీ కోడీ కోడీ 
బాగా 
తిన్నావా వేడి పకోడీ...
కుండా కుండా కుండా 
జాగ్రత 
ఎవరూ పగలగొట్టకుండా...
తేనే తేనే తేనే 
ఎంతో
మధురం తాగితేనే...
టీ టీ టీ టీ టీ టీ
మామ 
నా బుగ్గ నొక్కుతాడేంటి!

26) కిచ కిచ పిచ్చుక

కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
కిటికీగుండా దూరింది 
ఇంటి లోపలికి చేరింది...
కిచ కిచ పిచ్చుక
కిలాడి పిచ్చుక 
బల్ల మీద ఉన్నది అద్దం
చూడదలచినది తన అందం...
కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
అద్దం లోపల చూసుకొన్నది
అక్కడ ఇంకో పిచ్చుకున్నది...
కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
ఎక్కడి దింకో పిచ్చుక అంటూ
ముక్కుతో పోటు పొడిచింది...
కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
అద్దం ముక్క లయ్యింది
పిచ్చుక పారిపోయింది.

27) చుక్కలం చుక్కలం...

చుక్కలం చుక్కలం 
చక్క నైన చుక్కలం 
కమ్ముకున్న చీకటిలో 
కాంతి పాట పాడుతాం...
మొక్కలం మొక్కలం 
ముద్దొచ్చే మొక్కలం 
ముచ్చటైన లోకంలో 
పూల పాట పాడుతాం...
మేఘాలం మేఘాలం 
మెరుస్తున్న మేఘాలం 
వరపులోన పొలం మీద 
వాన పాట పాడుతాం...
చిట్టి చిట్టి పిల్లలం 
చిన్నారి పిల్లలం 
చిన్ని ఆట లాడుతాం 
చిలిపి పాట పాడుతాం

28) మాట ఒకటి చెబుతాను...

మాట ఒకటి చెబుతాను 
వింటావా...
పాట ఒకటి నేర్పుతాను 
పాడ్తావా...
తోట ఒకటి చూపిస్తా 
వస్తావా...
బాట ఒకటి చూపిస్తా 
పోతావా...
కోట ఒకటి కట్టారు 
ఎక్కెదెవా...
మూట ఒకటి దాచారు 
తెచ్చెదవా...
పీట ఒకటి తెచ్చిస్తా 
ఎక్కెదెవా......
మీట ఒకటి చూపిస్తా 
నొక్కెదెవా...
మాట పాట తోట బాట 
కోట మూట పీట మీట 
బాగుందా ఈ పాట 
బై బై బై...టా టా టా...

29) తెలుగు నాడంతా నాదే...

శ్రీకాకుళం నాదే,చిత్తూరు నాదే, 
ఆంధ్రప్రదేశ్ నాదే...
విశాఖపట్నం నాదే, మచిలీపట్నం నాదే 
అంధ్రప్రదేశ్ నాదే...
కర్నూలు కడప నాదే, ప్రకాశం నాదే 
ఆంధ్రప్రదేశ్ నాదే...
ఏలూరు నాదే, నెల్లూరు నాదే 
ఆంధ్రప్రదేశ్ నాదే...
విజయనగరం నాదే. అనంతపురం నాదే 
ఆంధ్రప్రదేశ్ నాదే...
అన్నవరం నాదే, అమరావతి నాదే 
ఆంధ్రప్రదేశ్ నాదే
హైదరాబాద్ నాదే, ఆదిలాబాద్ నాదే 
తెలంగాణా నాదే 
మెదక్ నాదే, మహబూబునగర్ నాదే 
తెలంగాణా నాదే
నల్గొండ నాదే, నిజామాబాద్ నాదే 
తెలంగాణా నాదే 
ఖమ్మం నాదే, కరీంనగర్ నాదే 
తెలంగాణా నాదే
రంగారెడ్డి నాదే, వరంగల్లు నాదే 
తెలంగాణా నాదే
తెలుగు నుడి నాదే, తెలుగు నానుడి నాదే,
తెలుగు యాస నాదే, తెలుగు ప్రాస నాదే...
ఆంధ్రప్రదేశ్ నాదే 
తెలంగాణా నాదే 
తెలుగు భాష మాట్లాడే 
తెలుగునాడు అంతా నాదే.

30) దాక్కో దాక్కో

సింహం వచ్చే 
సింహం వచ్చే 
నక్కా నక్కా 
దాక్కో దాక్కో...
నక్కా వచ్చే 
నక్కా వచ్చే 
కుక్కా కుక్కా 
దాక్కో దాక్కో...
కుక్కా వచ్చే 
కుక్కా వచ్చే 
పిల్లీ పిల్లీ 
దాక్కో దాక్కో...
పిల్లీ వచ్చే 
పిల్లీ వచ్చే 
ఎలుకా ఎలుకా 
దాక్కో దాక్కో...
ఎలుకా వచ్చే 
ఎలుకా వచ్చే 
బందరు లడ్డూ
దాక్కో దాక్కో.

31) అనగనగా ఒక పులి

అనగనగా ఒక పులి 
దానికి బాగా ఆకలి
ఒక కుందేలును తిన్నది 
తీరలేదు ఆకలి 
రెండు జింకలను తిన్నది 
తీరలేదు ఆకలి
మూడు గేదెలను తిన్నది 
తీరలేదు ఆకలి 
నాల్గు ఆవులను తిన్నది 
తీరలేదు ఆకలి
అయిదు నక్కలను తిన్నది 
తీరలేదు ఆకలి 
ఆరు కుక్కలను తిన్నది 
తీరలేదు ఆకలి
ఏడు కోతులను తిన్నది 
తీరలేదు ఆకలి 
ఎనిమిది గొర్రెలు తిన్నది 
తీరలేదు ఆకలి
తొమ్మిది పందులు తిన్నది 
తీరలేదు ఆకలి 
పది ఏనుగులు తిన్నది 
తీరలేదు ఆకలి
వేటగాడు వచ్చాడు 
మాటు వేసి చంపాడు 
చచ్చే పోయిం దా పులి 
లేనే లేదిక ఆకలి.

32) తాతా తాతా...

తాతా తాతా
బడి కొస్తావా,
రాలే నయ్యా 
రాలే నయ్యా...
తాతా తాతా
పొల మొస్తావా,
రాలే నయ్యా 
రాలే నయ్యా...
తాతా తాతా
ఊ రొస్తావా,
రాలే నయ్యా 
రాలే నయ్యా...
తాతా తాతా
పెళ్ళాడతావా,
అట్టా గయ్యా 
వస్తా నయ్యా...

33) మా ఊళ్ళోకొచ్చారు...

మా ఊళ్ళో కొచ్చారు 
దోపిడీకి దొంగలు 
మేము ఫోను చేసాము 
కదిలారు పోలీసులు...
గుర్ర మెక్కి వచ్చాడు 
ఒక పోలీసు,
గుంటలోన పడ్డాడు 
ఆ పోలీసు...
గాడి దెక్కి వచ్చాడు 
ఒక పోలీసు 
కాలవలో పడ్డాడు 
ఆ పోలీసు...
ఏనుగెక్కి వచ్చాడు 
ఒక పోలీసు,
ఏటిలోన పడ్డాడు 
ఆ పోలీసు...
సింహ మెక్కి వచ్చాడు 
ఒక పోలీసు 
చెదిరి పారిపోయారు 
దొంగ లందరూ...

34) అమ్మకు మీసం లేదు

అమ్మకు మీసం లేదు 
నాకు ముద్దు పెడుతుంది 
ఎంతో 
మెత్త గుంటుంది...
నాన్నకు మీసం లేదు 
నాకు ముద్దు పెడతాడు 
ఎంతో 
మెత్త గుంటుంది...
తాతికి మీసం లేదు 
నాకు ముద్దు పెడుతుంది 
ఎంతో 
మెత్త గుంటుంది...
తాతకు మీసం ఉంది 
నాకు ముద్దు పెడతాడు 
ఎంతో 
గుచ్చు కుంటుంది...
నాకు మీసం లేదు 
నేనె ముద్దు పెడతాను 
ఎంతో 
మెత్త గుంటుంది...

35) దూరంగా ఉండాలి...

ఒక్క బుల్లి సూదయినా 
దూరంగా ఉండాలి 
బంతికి తగిలిందంటే 
బంతి బతుకు ఖాళీ...
ఒక్క బొట్టు విష మైనా 
దూరంగా ఉండాలి 
పాల కుండలో పడితే 
పాల బతుకు ఖాళీ...
ఒక్క నిప్పు రవ్వయినా
దూరంగా ఉండాలి 
ఇల్లు అంటుకుందంటే 
ఇంటి బతుకు ఖాళీ...
ఒక్క నేర మేదయినా
దూరంగా ఉండాలి 
మనిషి చిక్కుకున్నాడా
మనిషి బతుకు ఖాళీ...

36) నాలో దేవత లున్నారు...

నా నుదురు లోన ఉన్నాడట 
బ్రహ్మ దేవుడు...
నా కళ్ళల్లో ఉన్నారట 
శివ కేశవులు...
నా ముక్కు మీద ఉన్నాడట 
విఘ్నేశ్వరుడు...
నా బుగ్గలపై ఉన్నారట 
లక్ష్మీ పార్వతులు...
నా పెదవులలో ఉన్నాడట
ఆంజనేయుడు...
నా గడ్డంలో ఉన్నాడట 
భీమసేనుడు...
నా మాటలలో ఉన్నదంట
సరస్వతీ మాత...
నా చేతలలో ఉన్నదంట 
నా ముందు బతుకు గీత.

37) అమ్మ సుఖంగా ఉండాలి...

అమ్మ సుఖంగా ఉండాలి 
నాన్న ఖుషీగా ఉండాలి 
అమ్మా నాన్నలతో కలిసి 
నేను హాయిగా ఉండాలి...
అక్క సుఖంగా ఉండాలి 
చెల్లి ఖుషీగా ఉండాలి 
అమ్మా నాన్నలతో కలిసి 
మేము హాయిగా ఉండాలి...
అన్న సుఖంగా ఉండాలి 
తంబి ఖుషీగా ఉండాలి 
అమ్మా నాన్నలతో కలిసి 
మేము హాయిగా ఉండాలి...
తాతి సుఖంగా ఉండాలి 
తాత ఖుషీగా ఉండాలి 
అమ్మా నాన్నలతో కలిసి 
మేము హాయిగా ఉండాలి.
ప్రజలు సుఖంగా ఉండాలి 
ఊరు ఖుషీగా ఉండాలి 
అవని మీద బతికే ప్రాణులు...
అంతా హాయిగ ఉండాలి.

38) కారు కొనిపెడతాను...

కారు కొనిపెడతాను 
ఆడుకుంటావా...
కారు చెడి పోతుంది 
కారు నా కొద్దు...
బంతి కొనిపెడతాను 
ఆడుకుంటావా...
బంతి పాడవుతుంది
బంతి నా కొద్దు...
రైలు కొనిపెడతాను 
ఆడుకొంటావా...
రైలాగి పోతుంది 
రైలు నా కొద్దు...
ఫ్లయిటు కొనిపెడతాను
ఆడుకుంటావా...
ఫ్లయిటు పడిపోతుంది 
ఫ్లయిటు నా కొద్దు...
ఏమి కావాలి, 
కన్నా, 
నీ కేమి కావాలి...
ముద్దు లొలికే కుక్క 
పిల్ల కావాలి.

39) పులి కనిపిస్తే ఏం చేస్తావు!

ఒక్కసారిగా పులి కనిపిస్తే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి కనిపిస్తే 
అదరను బెదరను ఏ మాత్రం,
పరుగులు పెట్టను ఏ మాత్రం...
ఒక్కసారిగా పులి ఎదురుంటే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి ఎదురుంటే 
మెల్లగ వెనక్కు పోతాను, 
చల్లగ జారుకుంటాను...
ఒక్కసారిగా పులి ఎదురొస్తే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి ఎదురొస్తే 
భీకర శబ్దం చేసేస్తా,
పెద్దగ దేహం పెంచేస్తా,,,
ఒక్కసారిగా పులి పైబడితే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి పైబడితే 
ఆ పులి వీపున గుద్దేస్తా,
పిడికిలి బిగించి పొడిచేస్తా.

40) అమ్మ చెబితే...

అమ్మ చెబితే 
స్వీటు తింటా...
నాన్న చెబితే 
హాటు తింటా...
తాతి చెబితే 
పాలు తాగుతా..
.
తాత చెబితే 
అన్నం తింటా...
( విశ్వేష్, మూడేళ్ళ  రావి రంగారావుగారి  మనవడు ఆశువుగా చెప్పిన చిట్టి గేయం)

41) అమ్మ చెబితే...

అమ్మ చెబితే 
స్వీటు తింటా...
నాన్న చెబితే 
హాటు తింటా...
అక్క చెబితే 
ఆపిల్ తింటా,
బావ చెబితే 
బనానా తింటా...
అన్న చెబితే 
అట్లు తింటా,
వదిన చెబితే
ఇడ్లీ తింటా...
బాబాయ్ చెబితే 
సపోటా తింటా,
పిన్ని చెబితే 
పిజ్జా తింటా....
పెదనాన్న చెబితే 
పకోడీలు తింటా,
పెద్దమ్మ చెబితే 
జిలేబీ తింటా...
అత్త చెబితే 
అరిసెలు తింటా,
మామ చెబితే 
లడ్లు తింటా...
తాతి చెబితే 
పాలు తాగుతా...
తాత చెబితే 
అన్నం తింటా...
( విశ్వేష్, మూడేళ్ళ  రావి రంగారావుగారి మనవడు ఆశువుగా చెప్పిన చిట్టి గేయాన్ని పెంచి రాసారు)

42) ఏదో ఏదో చూడాలి 

ఏదో ఏదో చూడాలి 
ఏదేదో మాటాడాలి
చక్కని పల్లెలు చూడాలి 
రైతులతో మాటాడాలి 
పచ్చని పైరులు చూడాలి 
పొలాలతో మాటాడాలి
ఎత్తగు కొండలు చూడాలి
బండలతో మాటాడాలి 
లోతగు కోనలు చూడాలి 
సరసులతో మాటాడాలి
చిక్కని అడవులు చూడాలి 
తరువులతో మాటాడాలి 
వంపుల దారులు చూడాలి 
మృగాలతో మాటాడాలి
అన్నిటినీ చూడాలి 
అందరితో మాటాడాలి...

43) కలిసి పని చేయాలి

ఒకటికి ఒకటికి అడ్డు 
ప్లస్ ఉంటే అది రెండు, 
ఒకటి పక్క ఒకటుంటే 
అపుడు విలువ పదకొండు...
ఒక్క అంకె కిందున్నా
మరో అంకె పైనున్నా 
ఆ విలువలు పరిమితం 
కలిసుంటే అపరిమితం...
ఏ ఇంటూ ఏ ఏ స్కేర్ 
బీ ఇంటూ బీ బీ స్కేర్ 
ఏ ప్లస్ బీ హోల్ స్కేర్ 
ఏ స్కేర్ బీ స్కేర్- టూ ఏ బీ అదనం...
వ్యక్తులుగా పని చేస్తే 
ఫలితం చాలా స్వల్పం,
కలిసికట్టుగా చేస్తే 
మన దేశం మహోదయం.

44) నా ముద్దులు

పచ్చ పచ్చగా పెరిగే
మొక్కకు నా ముద్దులు, 
చక్క చక్కగా ఎదిగే 
చెట్టుకు నా ముద్దులు...
తియ్య తియ్యగా పలికే
చిలకకు నా ముద్దులు,
రయ్యి రయ్యినా సాగే 
ఉడతకు నా ముద్దులు...
ముద్దు ముద్దుగా కదిలే 
పిల్లికి నా ముద్దులు,
చిలిపి చిలిపిగా ఆడే
కుక్కకు నా ముద్దులు...
మంచి మంచిగా ఉంటే 
అందరికీ ముద్దులు,
పిచ్చి పిచ్చిగా ఉంటే 
ఎవరికైన గుద్దులు.

45) ఏ గుర్రం బాగుంది!

అమ్మ గుర్రం బాగుందా,
నాన్న గుర్రం బాగుందా,
ఏ గుర్రం బాగుంది! నీ 
కే గుర్రం బాగుంది!
అత్త గుర్రం బాగుందా,
మామ గుర్రం బాగుందా,
ఏ గుర్రం బాగుంది! నీ 
కే గుర్రం బాగుంది!
జేజి గుర్రం బాగుందా,
తాత గుర్రం బాగుందా,
ఏ గుర్రం బాగుంది! నీ 
కే గుర్రం బాగుంది!
ఆదివారము “జూ’ కెళ్ళాము,
ఎన్నో జంతువు లున్నాయి,
గుర్రం స్వారీ చేశాను,
అసలు గుర్రమే బాగుంది.

46) అ ఆ లలో అంతరార్ధం 

అ అంటే అమ్మ అందరికీ ఉన్నాది అమ్మ 
అమ్మ లేకపోతే లేదు నీకు జన్మ 
ఆ అంటే ఆవు అమ్మ వంటిదె ఆవు 
ఆవు తనబిడ్డకే కాకుండా బిడ్డలకీ ఇస్తుంది పాలు 
ఇ అంటే ఇల్లు ఇల్లు ఎండకి ఎండి వానకి తడిసి 
చలికి వనికి ఎండ,వాన,చలి నుండి మనల్ని కాపాడేదె ఇల్లు 
ఉ అంటె ఉడుత వారధి కట్టడంలో రామునికి అందించింది సాయం 
రాముని మెప్పు పొందింది చిట్టి ఉడత 
ఊ అంటే ఊయల ఊయల తాను వేలాడుతూ 
బరువుమోస్తూ పాపాయికి హాయినిస్తోంది ఊయల 
లోకంలో అన్నీ ఇతరులకోసమే తాము బ్రతుకుతూ 
ఇతరులకి హాయినిస్తున్నాయి మనిషిగాపుట్టిన మనం 
ఇతరులకి ఏమైనా మనం ఉపయోగపడుతున్నామా!!!!!!!!!!!! 
ఒక్కసారి ఆలోచించండి మనిషిగా బ్రతకండి 
ఇతరులకి సహాయ పడండి 
---అయ్యగారి రామకృష్ణ ..... నాగులవలస 

47) అచ్చులతో డైలాగులు !!!! 

1)అట్లు తింటే ఆకలి తీరుతుంది కాని అట్ల కాడ నాకితే ఆకలి తీరుతుందా !!! 
2)ఆవకాయ నంచుకోడానికి లేదని ఆవాలు నమిలితే ఆవకాయ అవుతుందా!!! 
3)ఇల్లు లేదని ఎన్నాలు ఇతరుల ఇంట్లో ఉన్నా ఇల్లు మనది అవుతుందా !!! 
4)ఈగలున్నాయని ఈలవేస్తే పోతాయా !!1 
5)ఉప్పు లేదని పంచదార ఎంత వేస్తే మాత్రం ఉప్పురుచి వస్తుందా !!! 
6) ఊరువాల్లు ఎంత పొమన్నా వల్లకాడు రమ్మనొద్దూ !!
7)ఋణమాఫీ రైతుకి కావాలిగాని తీర్చే వాడి భాధ ఎవడికి కావాలి 
8)ఎలుకులున్నాయని పిల్లిని పెంచితే పిల్లి కోసం పాలు కొనాలి. 
9) ఏ ఊరు లేనివాడికి బ్రతికిందే ఊరు 
10)ఐసు అమ్మే అబ్బాయి ఎండగా ఉందని నీడని కూర్చుంటే ఐసు కరుగుతుంది గాని చెల్లుతుందా !! 11)ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఎన్ని కొనగలం. 
12)ఓడ ఉన్నంతమాత్రాన్న ఏరు దాటలేం ఓడ నడిపే తెలివితేటలుండాలి కదా!!! 
13)ఔషధం దగ్గర ఉంది కదా అని జబ్బు రాకుండా తాగితే కొత్త జబ్బు వస్తుంది .
 --అయ్యగారి రామకృష్ణ...... నాగులవలస 

48) ప గుణింతం తో పాట 

పలక కొన్నాను 
పాపకి ఇచ్చాను 
పిచ్చిగీతలు గీసింది 
పీచుతో తుడిచింది 
పువ్వులు అమ్మాకొన్నాది 
పూలజడవేసింది 
పెట్టెలోహారం వేసింది 
పేసుకి పౌడర్ పూసింది 
పైకి వచ్చి చూపించింది 
పొరుగు వారు మెచ్చేరు 
పోలేరమ్మకు మొక్కింది 
పౌర్ణిమ నాడు గుడికి వెల్లింది 
పండు కాయ నైవేద్యం పెట్టింది 
చల్లగ చూడమని మొక్కింది 
------ అయ్యగారి రామకృష్ణ..... నాగులవలస

49) చెట్టు మీద జాంపండు పండింది

చెట్టు మీద జాంపండు పండింది
అది చూసి నా నోరు ఊరింది
నోరేమో చెప్పింది చేతులతో కోసియ్యమని
చేతులేమో కదిలాయి కోసేందుకు
వద్దంది,తప్పంది నామనసు నా చేతులతో
ఎందుకని అడిగాయి నాచేతులు
పరులు సొమ్ము పాము వంటిది
అడగకుండ తీయొద్దు అని చెప్పలేదా మాస్టారు !
అన్నాది నామనసు నా చేతులు తో
మనసు మాట విన్నాను
మంచివాడనిపించు కొన్నాను .
------ అయ్యగారి రామకృష్ణ..... నాగులవలస

50) బడి--- గుడి

అదుగో బడి
బడి పక్కన గుడి
బడికి వెల్తే జ్ఞానం-- వస్తుంది 
గుడికి వెల్తే మోక్షం--వస్తుంది 
రోజూ బడికి -- గుడికి వెల్లండి
జ్ఞానం--- మోక్షం పొందండి
-----------------అయ్యగారి రామకృష్ణ ,నాగులవలస.

51) రండీ ఓ బాలల్లారా --- రండీ రారండీ !!!

తీర్ధ యాత్రల కి వెల్దాం రండీ రారండీ !!!
అరసవల్లి వెల్దాం --- సూర్యనారాయణ స్వామిని దర్శిద్దాం
సిం హాచలం వెల్దాం --- అప్పన్న స్వామిని దర్శిద్దాం 
అన్నవరం వెల్దాం --- సత్య స్వామిని దర్శిద్దాం 
బెజవాద వెల్దాం --- దుర్గమ్మని దర్శిద్దాం 
తిరుపతి వెల్దాం --- వెంకన్నస్వామిని దర్శిద్దాం 
శ్రీశైలం వెల్దాం --- - మల్లన్న స్వామిని దర్శిద్దాం
బాసర వెల్దాం --- - చదువుల తల్లి సరస్వతీదేవిని దర్శిద్దాం
చదువులు బాగారావాలని మొక్కుదాం
అందరి దేవుల్లని దర్శిద్దాం
అందరి దేవుల్లని మొక్కుదాం 
అందరు బాగుండాలని కోరుదాం 
ఆనందంగా తిరిగొద్దాం 
---అయ్యగారి రామకృష్ణ , నాగులవలస .

52) మా బాబు భాష

మా బుజ్జి బాబు 
కళ్ళతో మాట్లాడుతున్నాడు 
నను పలకరించండి 
నను పలకరించండి....
మా కొండ బాబు 
చేతులతో మాట్లాడుతున్నాడు
నన్నెత్తుకోండి 
నన్నెత్తుకోండి...
మా కన్న బాబు 
కాళ్ళతో మాట్లాడుతున్నాడు 
నాతోటి ఆడండి 
నాతోటి ఆడండి...
మా చిట్టి బాబు 
నోటితో ఏడుస్తున్నాడు 
నా కాక లయ్యింది 

పాలు పట్టండి...

53) తాతా తాతా, ముద్దు పెడతా

తాతా తాతా ముద్దు పెడతా,
స్నానం చెయ్యి- మురికి ఉన్నది,

తాతా తాతా ముద్దు పెడతా,
ముఖం కడిగెయ్- చెమట ఉన్నది,.

తాతా తాతా ముద్దు పెడతా,
గడ్డం చెయ్యి, గుచ్చుకున్నది...

తాతా తాతా ముద్దు పెడతా,

మీసం తీసెయ్- మెత్తగుంటది.

54) అమెరికాలో పుట్టాను ఓ తాతా...

అమెరికాలో పుట్టాను ఓ తాతా
ఆంధ్రాలో దిగుతాను ఓ తాతా...

గుంటూరు వస్తాను ఓ తాతా
మన ఊరు చూస్తాను ఓ తాతా...

మిరపకాయ తింటాను ఓ తాతా
రౌడీల్ని తంతాను ఓ తాతా...

55) మా తాత నా పేరు మరిచిపోయాడు

మా తాత నా పేరు మరిచిపోయాడు 
బుజ్జి కొండంటాడు కాసేపు...

మా తాత నా పేరు మరిచిపోయాడు 
బంగార మంటాడు కాసేపు...

మా తాత నాపేరు మరిచిపోయాడు 
నాన్నగా రంటాడు కాసేపు...

అందుకే ఒక రోజు తాత నన్నాను 
"మతి మరుపు కొండా"- నవ్వుకున్నాడు.

56) ఏ కొండవి బాబూ, 
నువ్వే కొండవి బాబూ....

తిరపతి కొండని నేను 
శ్రీశైలం కొండని నేను..

ఏ కొండవి బాబూ, 
నువ్వే కొండవి బాబూ....

అన్నవరం కొండని నేను 
సింహాచలం కొండని నేను...

ఏ కొండవి బాబూ, 
నువ్వే కొండవి బాబూ....

భద్రాద్రి కొండని నేను 
యాదాద్రి కొండని నేను...

ఎవ్వరి కొండవి బాబూ, 
నువ్వెవ్వరి కొండవి బాబూ....

అమ్మ కొండను నాన్నకొండను 
అమెరికా కొండను, ఇండియా కొండను.

57) తాత చెవిని పీకేస్తా...

అమ్మ ఎత్తుకుంటుంది
ఎంతో బాగుంటుంది
నాన్న ఎత్తుకుంటాడు
ఎంతో బాగుంటుంది...
నానమ్మ ఎత్తుకుంటుంది
ఎంతో బాగుంటుంది
అమ్మమ్మ ఎత్తుకుంటుంది
ఎంతో బాగుంటుంది...
అత్త ఎత్తుకుంటుంది
ఎంతో బాగుంటుంది
మామ ఎత్తుకుంటాడు
ఎంతో బాగుంటుంది...
అంద రెత్తుకుంటుంటే
నన్నెత్తుకోవేంటి తాతా,
నన్నెత్తుకోక పొతే
నీ చెవిని పీకి పారేస్తా...