Monday, May 6, 2013

ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా

ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా !


ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా !

లోకం చూడగ కోరిక కనుక 

పలికెద వెందుకే చిలుకా చిలుకా !

ఊహలు చెప్పగ మనసగు కనుక

అలిగెద వెందుకే చిలుకా చిలుకా !


కాయలు పండ్లు ఈయరు గనుక.....



చింతకాయ

చింతకాయ

చిమడకే చిమడకే -- ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా -- నీ పులుపు పోదు

(చింతకాయను చూడగానే తినెయ్యాలని అనిపిస్తుంది కదా.... కానీ అది తింటుంటే ఆ పులుపుకి కన్నుకొట్టినట్టు అవుతుంది కదా)










నల్లకుక్కను కర్రిఆవుగా చేయుట:--(తెనాలిరామలింగ కథ)

నల్లకుక్కను కర్రిఆవుగా చేయుట:--(తెనాలిరామలింగ కథ)
తెనలిరామలింగ కవి అంటే తెలియనివారు ఎవరూ ఉండరు కదా ? అతని కథలు మనకు హాస్యాన్ని తెప్పిస్తాయి, ఆలోచింపచేస్తాయి కూడా. అటువంటి కథలలో ఒకటి మనం ఈ రోజు చెప్పుకుందాము. 

శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానములో చాలాకాలం నుండి విశ్వాసపాత్రుడు, పనిలో నైపుణ్యం కలవాడు అయిన ఒక మంగలివాడు ఉండేవాడు. ఆ మంగలివాడు ఎప్పుడూ దైవభక్తి కలిగి సదాచారపరాయణుడై కాలం గడుపుతూ ఉండేవాడు. అతని విశ్వాసము చూసి రాయలువారికి ముచ్చటవేసి "ఒరేయ్ అబ్బీ ! నీకేమి కావాలో కోరుకో" అని అన్నారు. అప్పుడామంగలి "మహాప్రభో ! నేను చిన్నప్పటినుండి నిష్టాగరిష్టుడనై భక్తిశ్రద్ధలతో ఎన్నో పూజలూ, నోములు చేశాను. నన్ను ఎలాగైనా బ్రాహ్మణునిగా మార్చండి" అని రాయలవారిని బ్రతిమాలాడు. రాయలువారు సరేయని రాజపురోహితులను పిలచి ఇతనిని బ్రాహ్మణునిగా మార్చండి అని ఆజ్ఞాపించెను.

రాజపురోహితులు తెల్లబోయి, అడ్డుచేబితే రాజు ఎక్కడ దండనవిధిస్తాడో అని భయపడి, ఆ మంగలిని ప్రతీరోజు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, హొమాదిజపములు చేయిస్తూ, మంత్రోచ్ఛారణ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సంగతి ఒకరోజు తెనలిరమలింగనికి తెలిసింది. ఒక రోజు అతడు కూడా ఒక నల్లకుక్కను వెంటబెట్టుకుని నదిఒడ్డుకి వెళ్ళి, కుక్కను నీటిలో ముంచుతూ, కొన్ని బీజాక్షరాలను చదువుతూ ఉన్నాడు.

మంగలిని బ్రాహ్మణునిగా ఎంతవరకు మార్చారో తెలుసుకుందాము అని రాయలవారు ఒకరోజు నదిఒడ్డుకి వచ్చారు. నది ఒడ్డున---- ఒకపక్క రాజపురోహితులు మంగలిని, మరోపక్క రామలింగడు కుక్కని నీటిలో ముంచుతూ మంత్రాలూ చదవటం చూసారు. ఆ రెండు దృశ్యాలు చూసి, రామకృష్ణుని అవస్థ చూసి రాయలు వారు పకపక నవ్వి రామలింగడిని ఇలా ప్రశ్నించారు, " ఓయీ రామకృష్ణా ! నేకేమైన పిచ్చిపట్టినదా, కుక్క-- కుక్కే గానీ--- కర్రిఆవు ఎలా అవుతుందీ" అని. అంతట రామకృష్ణుడు రాయలవారిని " పిచ్చి నాకు కాదు మీకే, లేకపోతే మంగలి బ్రాహ్మణుడు ఐతే, కుక్క గోవుగా ఎందుకు మారకూడదు ?"... అని ఎదురుప్రశ్న వేసెను.

ఆమాటకు రాయలవారికి జ్ఞానోదయం అయ్యి, తనతప్పు తెలుసుకొని, తనకి బుద్ధి తెప్పించటానికే రామలింగడు ఇలా చేసాడని తలచి బ్రాహ్మణులు చేసే పనిని ఆపివేయించెను.


టైర్ ఆట

టైర్ ఆట
ఇలా టైర్లు కర్రతో కొట్టుకుంటూ మీరు ఎప్పుడైనా ఆడారా..... నేనైతే మగపిల్లలతో సమానంగా ఆడి గెలిచేదానిని..... వేసవికాలంలో ఎక్కువగా ఆడేవాళ్ళము ఇటువంటి ఆటలు....... అమ్మతో చెప్పకుండా.... రోడ్లపైకి వెళ్ళి, స్నేహితులతో ఆడి, ఇంటికి వచ్చాక..... అమ్మతో ఫుల్ గా చివాట్లు తినేదానిని. అప్పుడు ఆ టైంకి కోపం వచ్చేది.... కానీ ఊరుకుంటామా ఏమిటి..... తెల్లారితే మళ్ళి మామూలే..... టైర్లు పట్టుకుని రోడ్లు మీదకి పరుగులు.... నిజంగా ఆ సరదాలే వేరు. మళ్ళీ తిరిగిరాని మధుర జ్ఞాపకాలు కదా.....


చెమ్మచెక్క

చెమ్మచెక్క

చెమ్మచెక్క -- చారడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ --ఆరగించంగ

ముత్యాల చెమ్మచెక్క --- ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క --- రంగులెయ్యంగ

పగడాల చెమ్మచెక్క --- పందిరెయ్యంగ
పందిట్లో మాబావ --- పెల్లిచేయ్యంగా

సుబ్బారాయుడు పెళ్ళి --- చూసివద్దాం రండి
మాఇంట్లో పెళ్ళి --- మళ్ళి వద్దాం రండి.

(హలో ఫ్రెండ్స్ మీ అందరికి ఈ పాట వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరూ కూడా మరిచిపోలేరు. అందరూ చిన్నప్పుడు ఆడుకునే ఆటే కదా..... ఇప్పటికీ మా ఇంటి దగ్గర శివరాత్రి, జనవరి 1(కొత్త సంవత్సరం) వచ్చిందంటే చిన్నపెద్ద అందరు ఆడవాళ్ళూ కలిసి ఆడుకుంటాము. ఒప్పులకుప్ప కూడా ఆడతాము. మరి మీరు కూడా ఎలా ఆడేవారో, మీ అనుభవాలు.... మీ మాటల్లో తెలియజేయండి) 


అష్టాచెమ్మా ఆట

హలో నేస్తాల్లారా ! మరొక ఆట అష్టాచెమ్మా
ఈ ఆట కూడా.......ఇంట్లో కూర్చుని ఆడుకునేదే. ఈ ఆటకి ఇద్దరు లేదా, ముగ్గురు, నలుగురు కూడా ఆడుకోవచ్చును. ఆడటానికి నేను ఉన్నాను, మరి మిగిలిన ముగ్గురు ఎవరు వస్తారు...... తొందరగా రండి ఆడుకుందాము. నేను ఆటకి కావలసిన బోర్డు, పిక్కలు తెచ్చాను.......వస్తే ఆడుకోవటమే లేటు......:)))))






"వైకుంఠపాళీ" ఆట

హాయ్ ఫ్రెండ్స్.....మరో ఆట "వైకుంఠపాళీ"
ఈ ఆటని తెలియని వారు ఉండరు అనుకుంటున్నాను. ఎందుకంటే......కాలం మారుతూఉన్నకొద్ది......పేర్లు కూడా మారిపోతున్నాయి. మా చిన్నతనంలో ఈ ఆటని "వైకుంఠపాళీ" అనేవారు.... ఇప్పుడేమో snake & ladder అంటున్నారు. పేరు ఏదైనా సరే......మనకు ఆట ముఖ్యం కదా.... ఇంట్లో కూర్చుని ఆడేసుకోవటమే మనకు కావాలి. పదండి ఒక ఆట ఆడేద్దాము...... అందరిని పిలుచుకురండి త్వరగా...... :))))



దాడిఆట

దాడిఆట

హలో ఫ్రెండ్స్.......మనకి ఇక వేసవిసెలవులు వచ్చేసాయి కదా......బయటకి వెళ్ళి ఆడుకుందామంటే ఎండమండిపోతుంది, బయటకు వెళ్ళి ఆడకు అని అమ్మ దెబ్బలాడుతుంది కదా...... మరి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి..... చక్కగా ఇంట్లో బుద్దిగా కూర్చుని...... ఇంట్లో ఆడుకునే(indoor games) ఆటలు ఆడుకోవాలి. అలాంటి ఆటలు కొన్నిటిని నేను గుర్తుచేస్తాను, మీరు కూడా నేర్చుకొని ఆడుకొండే..... అప్పుడు అమ్మతో తిట్లు తినక్కరలెద్దు.... ఎండలోకి వెళ్ళి ఆడుకోనక్కరలేద్దు...... బుద్ధిగా ఇంట్లో కూర్చుని స్నేహితులతో ఆడుకోవచ్చును....

ఇదిగో ఇక్కడ చూసారా ఈ ఆటని.....దీనినే "దాడి ఆట" అని అంటారు. ఈ ఆటని 3-9-11...రాళ్ళతో, ఆడుకోవచ్చును. 3 రాళ్ళు వరసగా వస్తే దాడి అయినట్లు. అలా ఎవరైతే ముందుగా దాడి చేస్తారో వాళ్ళే గెలిచినట్లు..... బావుంది కదూ దాడిఆట........ మరి ఇంక ఆలస్యం ఎందుకు..... అమ్మని ఎలా ఆడాలో అడిగి తెలుసుకొని, ఆట మొదలుపెట్టండి..... enjoyyyyyyyy....




బావ బావ పన్నీరు

బావ బావ పన్నీరు
బావ బావ పన్నీరు -- బావని పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పారు -- వీసెడు గంధం పూసారు

చావిడి గుంజకు కట్టేరు -- చప్పిడి గుద్దులు గుద్దేరు
కాళ్ళ పీట వేసారు -- కడుపులో గుద్దులు గుద్దేరు

పట్టే మంచం వేసారు -- పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసారు -- నూరు గుద్దులు గుద్దేరు....

(భలే బావుంది కదండీ బావని ఆటపట్టించటం..... మా బావని చిన్నప్పుడు నేను ఇలాగే ఏడిపించేదానిని.... ఉడుక్కునే వాడు మా బావ)



చిట్టి చిట్టి మిరియాలు

చిట్టి చిట్టి మిరియాలు

చిట్టి చిట్టి మిరియాలు -- చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి -- బొమ్మరిల్లు కట్టి

రంగులన్నీ వేసి --తెల్లముగ్గులు పెట్టి
బొమ్మరింట్లో నీకు --బిడ్డపుడితేనేమో

బిడ్డనీకు పాలులేవు -- పెరుగులేదు
కలవారింటికి -- చల్లకోసం వెళితే

అల్లంవారి కుక్క -- భౌ భౌ మన్నది
నాకాళ్ళ గజ్జలు --ఘల్ ఘల్ మన్నవి

పుట్టలోపాము -- బుస్ బుస్ మన్నది
చెట్టుమీద పిట్ట -- కిచ కిచ మన్నది
చంకలో పాపాయి -- కేర్ కేర్ మన్నది....

(నేస్తాలు మీకు చిన్నతనం మళ్ళీ గుర్తువచ్చిందా.....బంకమన్నుతో బొమ్మరిళ్ళు కట్టుకోవటం, చిన్ని చిన్ని బొమ్మలు పెట్టి పెళ్ళిళ్ళు చెయ్యటం అంతా ఒక్కసారి గుర్తుకువచ్చిందా........చాలా సంతోషంగా ఉంది కదా చిన్నతనం గుర్తుకువచ్చి)