Sunday, April 21, 2013

పసిడి పాపాయి

పసిడి పాపాయి

పాపా పాపా లేవమ్మా !--పళ్ళూ తెల్లగ తోమమ్మా

ఒంటికి స్నానం చెయ్యమ్మా --ఉతికిన బట్టలు కట్టమ్మా 


చద్దీ అన్నము తినవమ్మా --చక చక బడికి వెళ్ళమ్మా

అ ఆ ఇ ఈ రాయమ్మా --అందరి మెప్పు పొందమ్మా

(నేను చిన్నప్పుడు చద్దన్నము తినే బడికి వెళ్ళేదానిని. బుద్దిగా చదువుకుని, ఎప్పుడూ క్లాసు ఫస్ట్ వచ్చేదానిని) 



సీతాకోకచిలుక

సీతాకోకచిలుక

సీతాకోకా చిలుకమ్మా --సింగారం అంతా నీదమ్మా
ఎన్ని రంగులు నీవమ్మా --అన్నిరంగులు ఉన్నాయమ్మా 

ఎన్ని చోట్ల తిరుగుతావో --ఎన్ని పూలు చూసావో
ఒక్కసారి రావమ్మ --మాకు చెప్పిపొవమ్మా
(సీతాకోకచిలుక అనగానే అందరికి ఇష్టమే కదా ! చూడగానే రంగురంగులతో అందరిని ఇట్టే ఆకర్షిస్తుంది)




నారింజకాయ

నారింజకాయ

నారింజకాయ ---నిన్ను చూడగానే 
నోరూరుతున్నది ---తొక్కతీసి తినగా
అబ్బబ్బ పులుపు ---తిననె తిననే
తీసి నేల కొట్ట ---తియ్యని నారింజ
తింటే -- హాయ్ హాయ్

(హాయ్ ఫ్రెండ్స్ ..... మీకు ఎవరికైనా నారింజకాయ అంటే ఇష్టమా ? నాకు ఇష్టమే...కానీ తొనలు తినను, జ్యూస్ మాత్రం తాగుతాను....) 


ఎన్నోరకాల గంట

ఎన్నోరకాల గంట
బళ్ళో గంట -- గణగణ
గుళ్ళోగంట --టంగ్ టంగ్ 

సైకిలు గంట --రింగ్ రింగ్ 
టెలిఫోన్ గంట -- ట్రింగ్ ట్రింగ్ 
 
గడియారం గంట -- డింగ్ డాంగ్
మన గుండె గంట --లబ్ డబ్.....లబ్ డబ్...

(బళ్ళో గంట మోగగానే... బడికి పరిగెడతాము, గుళ్ళో గంట మోగగానే....ప్రసాదానికి పరుగులు, సైకిలు గంట మోగగానే.... ఆడుకోవటానికి పరుగులు, టెలిఫోన్ గంట మోగగానే.....ఫ్రెండ్స్ తో కబుర్లు, గడియారం గంట మోగగానే.....సమయానికి పనులు చేసుకోవాలని గుండెల్లో గుబులు, ఇవన్నీ చూసి--చూసి గుండె కొట్టుకుంటోంది....లబ్ డబ్.....లబ్ డబ్...)


నా గాలిపటం

నా గాలిపటం

గాలిపటం చూడరా --గాలిలోన ఎగురురా 
దారం కట్టి వదలరా --దాని గొప్ప చూడరా 
ఎర్రరంగు గాలిపటం --ఎగురుతుంది చూడరా
రెక్కలేమో లేవురా --పక్షివలె ఎగురురా
తోక ఉంది చూడరా --కోతి మాత్రం కాదురా 
తాడులాగి వదలరా --పల్టీలు కొట్టును చూడరా !

(హల్లో నేస్తాల్లారా! మీరు కూడా చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసారా ? ఇప్పుడు వేసవి సెలవులు సమయం కదా !ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కలసి ఆడుకునే ఆట కదా ఇది.....మరి గాలిపటాలు రెడీ చేసారా లేదా ?.... నేను రెడీ ఆడుకోవటానికి)



కాకి---నక్క కథ

హలో మిత్రులారా.... ఈ రోజు మనం కాకి---నక్క కథ చెప్పుకుందామా !

అనగనగ ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుమీద ఒక కాకి ఉంటోంది. ఒకరోజు ఆ కాకికి ఒక మాంసంముక్క దొరికింది. ఆ మాంసంముక్కని చెట్టుకొమ్మపైన కూర్చుని తింటోంది. ఇంతలో చెట్టుదగ్గరికి వచ్చిన నక్కకి ఆ మాంసం వాసన వచ్చి, ఎలాగైనా కాకి దగ్గరనుండి ఆ ముక్కని దొంగలించి పట్టుకుపోవాలి అని ఒక చెడు ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ గుంటనక్క కాకి దగ్గరికి వచ్చి, ఇలా అన్నాది. 

"ఓ కాకి బావా ! నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ ఒడ్డు, పొడవు చూస్తే నీకు రాజు అయ్యే లక్షణాలు కనబడతున్నై, నీకే గనుక మంచి గొంతు ఉంటే తప్పకుండా రాజువి అవుతావు." 

కాకి నక్కబావ మాటలు నమ్మి గొంతు విప్పి గట్టిగ పాడబోయింది, ఇంతలో దాని నోటిలో ఉన్న మాసం ముక్క కాస్తా కిందపడిపోయింది. వెంటనే గుంటనక్క ఆ మాసం ముక్కని దొరకపుచ్చుకుని, ఇలా అన్నాది. 

"ఓ కాకిబావ నీకు కొంచెం బుర్రతక్కువ, నిజంగా ఉంటేగనుక నువ్వే రాజువి అయ్యేదానివి." అని చెప్పి మాంసం ముక్కని నోట కరచుకుని తుర్రుమని పారిపోయింది. 

(చూసారా మిత్రులారా ! మనల్ని ఎవరైనా పొగిడితే బుట్టలో పడిపోకూడదు, కొంచెం ఆలోచించాలి. ఎందుకు వాళ్ళు అలా అన్నారు అని)


చేతివేళ్ళ పాట

చేతివేళ్ళ పాట

తిందాం తిందాం చిటికినవేలు 
ఎట్టా తిందాం ఉంగరంవేలు 

అప్పుచేసి తిందాం మధ్యవేలు
అప్పెట్లా తీరుతుంది ? చూపుడువేలు
 
ఉన్నాగదా నేను అన్నింటికీ మీకోసం
పొట్టివాడిని గట్టివాడిని అన్నది బొటనవేలు... 

(చూసారా ఫ్రెండ్స్ మనలాగే చేతివేళ్ళు కూడా ఎంత ఐక్యమత్యంగా ఉన్నాయో..... అందుకే అన్నారు పెద్దలు... ఐకమత్యమే మహాబలం అని)





బాతు

బాతు

ఓ చిన్న బాతు -- నా చిన్న బాతు
నిన్ను చూడగానే -- నాకెంతో ముద్దు
నన్ను చూసి నీవు -- తుర్రుమని పోకు

(చిన్ని బాతు పిల్లని చూస్తే ఎంత ముద్దుగా ఉంటుందో కదూ......పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ముద్దే....... కానీ ఈ రోజుల్లో పల్లెల్లో తప్పించి బాతులు మరెక్కడా కనిపించటం లేదు)




రైలుబండి

రైలుబండి 

వచ్చే వచ్చే రైలుబండి -- బండిలోన మామ వచ్చే
వచ్చిన మామ టీవి తెచ్చే -- టీవి లోన బొమ్మ వచ్చే 

బొమ్మలెంతో నాకు నచ్చే -- బడి నుండి అక్కా వచ్చే
తెచ్చే నాకు కుచ్చుల చొక్కా -- మెచ్చితి నేను పచ్చా చొక్కా

(బావ వచ్చి కొత్త చొక్కా ఇవ్వగానే, చింటూ గాడి మొహం చింకి చాట అంత అయ్యింది...... ఆ రోజుల్లో రైలుబండి ఎక్కి ఎవరైనా వస్తే ఎంత గొప్పో........ఏదో దేశం నుండి విమానమెక్కి వచ్చినట్టు ఫీల్ అయ్యిపోయేవారు)




ఉన్న ఊరు

ఉన్న ఊరు
ఉన్నఊరు విడిచి -- ఉండనే ఉండలేము
కన్నతల్లిని విడిచి -- అసలే ఉండలేము 

ఉన్నఊరే నాకు -- చెన్నపట్నమమ్మా
కన్నతల్ల్లే నాకు --కల్పవృక్షమ్ము......

(నిజమేకదండి ఉన్న ఊరిని, కన్నతల్లిని ఎవరైనా మరచిపోగలరా ? అలా మరచినవారు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే........ఉన్న ఊరిని అసలు ఎవ్వరూ మరచిపోలేరు......... ఎందుకంటే మన చిన్నతనంలో-- చదువు, స్నేహితులు అంతా అక్కడే గడిచిపోతుంది కదా ...........మరి అటువంటి మధుర జ్ఞాపకాలని ఎలా మరచిపోగలం మీరే చెప్పండి)



అబ్బాయి అమ్మాయి

అబ్బాయి అమ్మాయి
ఆడేపాడే అబ్బాయి -- అల్లరి చెయ్యని అమ్మాయి
అందరుకలసి రారండి -- చడువుల బడికి పోదాము
 
చదువులు బాగా చదివి -- పెద్దల దీవెన పొంది
ఆటలు బాగా ఆడి -- బహుమతులెన్నో తెద్దాము 

(మనం చదువులోని & ఆటలులోని---అన్నింటిలో ఎప్పుడూ ముందే ఉండాలి..... ఒక్కసారి వెనుకడుగు వేసామో........ముందుకు పోవటం చాలా కష్టం)




పొట్టిబావ

పొట్టిబావ

పొట్టిబావ పొట్టిబావ ఏం చేసాడు
ఉట్టిమీద చట్టిలోన జున్ను చూసాడు

జున్నుచూసి నోరూరి ఎగిరి చూసాడు
ఎగిరెగిరి ఉట్టి అందక కిందపడ్డాడు

నడ్డివిరిగి బావగారు చతికిల పడ్డారు
కాలువిరిగి బావగారు జారుకున్నారు 
 
(ఎవరైనా జారిపడితేనే నవ్వు వస్తుంది......... అందులోని బావ జారిపడితే..........వేరే చెప్పాలా---కొంటె మరదళ్ళ వేళాకోలాలు---బావల్ని ఏడిపించటం మరదళ్ళకి సరదా......... మరదళ్ళని ఆటపట్టించటం--- బావలకి వినోదం------బావుంటాయి కదూ........ బావామరదళ్ళ సరదాలు.... సరసాలు)


నా పేరు సూరి

నా పేరు సూరి
నా పేరు సూరి -- తిన్నాను పూరి
పట్టాను తలారి -- అయ్యాను బికారి 
ఎక్కాను లారి -- పడ్డాను జారి

(సూరిగాడు లారీ ఎక్కి పడ్డాడోచ్.........ఎవరైనా అలా పడిపోతే, వెళ్లి పైకి లేవదీయటం పోయి........ ఎగతాళి చేస్తాం......... మీరు అంతేనా ఫ్రెండ్స్?)



చెల్లీ నాతల్లీ

చెల్లీ నాతల్లీ
అదిగో చెల్లి -- గోడ మీద పిల్లి
గదిలో బల్లి -- ఊరుకోవేచెల్లి 

జడలోన మల్లి -- ఏడవకే తల్లి
వస్తాడే దొంగ -- ఓ చెల్లిమంగ
ఏడిస్తే గంగ -- వస్తుందే వేగంగా 

(చెల్లెళ్ళని ఏడిపించటం అన్నయ్యలకు భలే సరదా కదా, నన్ను కూడా చిన్నప్పుడు మా అన్నయ్య తెగ ఏడిపించేవాడు.......... ఇప్పుడు ఆ చిన్ననాటి సంఘటనలు అన్నీ తలచుకుంటూ ఉంటే, భలే తమాషాగా అనిపిస్తుంది కదూ)




నెమలి

నెమలి

చక్కని నెమలిని నేను
ఎన్నో ఆటలు ఆడుతాను

మబ్బులు పట్టుట చూడగనే
పింఛము విప్పి ఎగిరెదను 

చక్కగ నాట్యం చేసెదను
తకతై తకతై అని ఆడెదను 

(ఫ్రెండ్స్ నాకు నెమలి అంటే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమేనా ? నేను చిన్నప్పుడు నెమలీకల్ని పుస్తకాల్లో పెట్టి దాచుకునే దానిని.....వాన వచ్చేటప్పుడు నెమలి నాట్యం అంటే నాకెంత ఇష్టమో)




ఎన్నో రంగులు

ఎన్నో రంగులు

కాకి, కోకిల నల్లన --- నేరేడు పండు నల్లన 

ఆవు పాలు తెల్లన -- పాపాయి పళ్ళు తెల్లన 

కుంకుమ, తిలకం ఎర్రన -- చిలక ముక్కు ఎర్రన 

చామంతి, బంతి పచ్చన -- కాళ్ళకి పసుపు పచ్చన

ఆకాశంలో మేఘం నీలం -- సముద్రం నీరు నీలం

ఇదియే రంగుల వలయంరా

సృష్టి అంతయూ ఈ రంగుల వలయమేరా !



జ్ఞానేంద్రియాలు

జ్ఞానేంద్రియాలు

ముక్కు ఎందుకున్నది -- గాలి పీల్చుటకున్నది 

నాలుక ఎందుకున్నది --రుచిని తెల్పుటకున్నది 

చర్మం ఎందుకున్నది --స్పర్శ తెలుపుటకున్నది 

చెవులు ఎందుకున్నవి -- అన్నీ వినుటకున్నవి 

కళ్ళు ఎందుకున్నవి -- అన్నీ కనుటకున్నవి 

అన్నీ కలిపి ఈ ఐదు -- జ్ఞానేంద్రియాలు అంటారు 



చిన్నారి సైకిల్

చిన్నారి సైకిల్


చిన్నదమ్మ చిన్నది -- చిన్న సైకిల్ ఎక్కింది 

రోడ్డుమీదకి వెళ్ళింది -- కాలుజారి పడింది 


ఆసుపత్రిలో చేరింది -- ఇంటికి తిరిగి వచ్చింది 


మళ్ళి సైకిల్ ఎక్కింది -- సైకిల్ బాగా తొక్కింది 



కోడి

కోడి



కోడి కోడి రావే -- రంగుల కోడి రావే 

ఇదిగో బుట్ట చూడవే -- ధాన్యమున్నది తినవే 

పొడిచి పొడిచి తినవే -- పొట్టనిండా తినవే 

మంచినీళ్ళు తాగవే -- తెల్లని గుడ్డు పెట్టవే 


కోకిలమ్మ

కోకిలమ్మ


చెట్టుకు చెట్టుకు వాల్తాను

పిట్ట పిట్టకు పలుకుతాను

కొంగ్రొత్త చిగురులు మేస్తాను 

రంగైన పువ్వులు కోస్తాను 

పుప్పోళ్ళు గుప్పిళ్ళు తింటాను

మత్తుగా తీయగా పాడుతాను 

ఇంతకీ నేనెవరో తెలుసా

నేనేనండి కోకిలమ్మని 



గోడ గడియారం

గోడ గడియారం


గోడమీద గడియారం 


చూడు మనకు చెబుతోంది 


కాలమెంతో విలువైనది

గడియ వృధా చేయవద్దని 



బొమ్మా బొమ్మా బొమ్మా

బొమ్మా బొమ్మా బొమ్మా-- రెండుచేతుల బొమ్మా




బొమ్మా బొమ్మా బొమ్మా-- రెండుచేతుల బొమ్మా 

బొమ్మా బొమ్మా బొమ్మా---రెండు కాళ్ళ బొమ్మా 


బొమ్మకు రెండు కళ్ళు -- నోటినిండా పళ్ళు

సుందరాంగి పెళ్ళి -- చూసివద్దాం రండి

చుక్కల చుక్కల చీర -- వెండి అంచు చీర

ఐదువందల అప్పు -- చెప్పుకుంటే తప్పు



జేజేలమ్మ జేజేలు

జేజేలమ్మ జేజేలు

జేజేలమ్మ జేజేలు -- భారతమాతకు జేజేలు 

జేజేలమ్మ జేజేలు -- తెలుగుతల్లికి జేజేలు 

అమ్మానాన్నకు జేజేలు -- గురువుగారికి జేజేలు 

సూర్యచంద్రులకు జేజేలు -- పుడమితల్లికి జేజేలు

వరుణదేవునకి జేజేలు -- వాయుదేవునికి జేజేలు

తెలుగువారికి జేజేలు -- తెలుగు జాతికి జేజేలు







గాంధీతాత

గాంధీతాత

నున్నని గుండు -- సన్నని ముక్కు 


కళ్ళకి జోడు -- చేతిలో కర్ర 


చిన్న పిలక -- పరుగుల నడక


బాలల తాత -- భారత నేత

ఎవరు--ఎవరు--ఇంకెవరు మన గాంధీతాత



Happyga Holi

Happyga Holi 

HAI CHILDREN...Meeru kuda ee chitkaalu paatinchandi......Happyga Holi Panduga Jarupukondi.........

హోళీ పర్వదినాన్ని మనం చాలా భక్తి స్రద్దలతో చాలా ఆనందంగా జరుపుకుంటాము కదా.... కాని హోళీ రంగుల్లో రసాయనాలని ఉపయోగించకుండా సహజ రంగులని ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ఆనందం పొందినవారమవుతాము కదా..... ఒక్కసారి ఆలోచించండి...... ఆ సహజ రంగులు ఏవో నేను చెబుతాను మీరు కూడా వాడి చూడండి.. నేను ప్రతీ సంవత్సరము ఇలాగే రంగులు తయారుచేసి వాడుతూ ఉంటాను.... అందుకే మీకు చెబుతున్నాను.......

1)పసుపుని సెనగపిండితో కలిపితే పసుపు రంగు వస్తుంది...... ఇది నీటిలో కలిపి జల్లుకుంటే ఎటువంటి ప్రమాదము ఉండదు..పసుపుని చందనం పొడితో కలిపి నీటిలో వేసినా పసుపు రంగు వస్తుంది.....

2)పాలకూర వంటి ఆకుకూరలని సెనగపిండితో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది...... లేదంటే గోరింటాకు పౌడర్ ని సెనగపిండితో కలిపి నీటిలో కలుపుకోవచ్చును & కేవలము గోరింటాకు పౌడర్ ని నీటిలో కలిపినా ఆకుపచ్చ రంగు వస్తుంది.....

3)బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గులాబీ రేకులతో కలిపి రాత్రంతా నీటిలో నానపెడితే లేత ఎరుపు రంగు వస్తుంది.......టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపినా ఎరుపు రంగు వస్తుంది... మందారపూలుని ఎండబెట్టి పౌడర్ చేసి నీటిలో కలిపినా ఎరుపు రంగు వస్తుంది.....
4)గులాబి రేకులని నీటిలో నానపెట్టి గ్రైండ్ చేస్తే అందమైన గులాబి రంగు వస్తుంది....

5)నారింజ-- బత్తాయి తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసుకొని నీటిలో కలిపితే నారింజ రంగు వస్తుంది....
6)రకరకాల పువ్వులను & ఆకులను కలిపి నీటిలో నానబెట్టి గ్రైండ్ చేస్తే సరికొత్తరంగు తయారవుతుంది..
ఈ విధంగా మీరుకూడా మీకు కావలసిన రంగులను తాయారు చేసుకుని రంగురంగుల--ఆనందాల హోలీని జరుపుకోండి......ఆనందంగా ఉండండి...........




తిమ్మప్ప

తిమ్మప్ప 

బడికి పోరా తిమప్పా 

పంతులు కొడతాడే ఓయమ్మా 


కట్టెలకు పోరా తిమప్పా


కడుపు నొప్పే ఓయమ్మా 

గడ్డికి పోరా తిమప్పా

కాలు నొప్పే ఓయమ్మా 

మంచం తేరా తిమప్పా

మడమలు నొప్పే ఓయమ్మా 

నీళ్ళకు పోరా తిమప్పా

కీళ్ళు నొప్పే ఓయమ్మా 

తిండికి రారా తిమప్పా

అట్టా చెప్పవే మాయమ్మా 



చేతవెన్నముద్ద

చేతవెన్నముద్ద

చేతవెన్నముద్ద - చెంగల్వపూదండ 

బంగారుమొలత్రాడు - పట్టుదట్టి 


సందెతాయతలు - సిరిమువ్వ గజ్జెలు 


చిన్ని కృష్ణా - నిన్ను చేరి కొలుతు 




చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది

చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది



చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది

తాత బోడిబుర్ర మీద పిలక ఉన్నది


చిలక ముక్కు తాత ముక్కు తీరునున్నది


చింత తొర్ర తాత బుర్ర తీరునున్నది


తాతకాళ్ళకున్న జోడు కిర్రుమన్నది

చింతచెట్టు తొర్రలోన చిలుక తుర్రుమన్నది



కోతీబావకు పెళ్ళంటా

కోతీబావకు పెళ్ళంట


కోతీబావకు పెళ్ళంటా 
కోవెలతోట విడిదంటా

కొండా కోనా తిరిగెనంటా
కుక్కానక్కల విందంటా

ఏనుగు వడ్డన చేయునట
ఎలుగు వింతను చూచునటా

కోడీ కోకిల కాకమ్మా
కోతీ పెళ్ళికి పాటంటా

నెమళ్ళు నాట్యం చేయునటా
ఒంటెలు డోలు వేయునటా

ఊరంతా శుభలేఖలటా
వచ్చే వారికి విందులట

పెళ్ళిపీటలపై కోతీ బావ
పళ్ళికిలించునటా..


తారంగం తారంగం

తారంగం తారంగం 




తారంగం తారంగం
తాండవ కృష్ణా తారంగం
వేణూ నాథా తారంగం 
వెన్న ముద్దల తారంగం
ఆలా బాలా తారంగం

ఆడుకో పాపా తారంగం